Musi Riverfront Project: రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతి.. 21 కి.మీ. మేర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్.!

Musi River

Musi River

Musi Riverfront Project: హైదరాబాద్ నగర ప్రతిష్ఠాత్మక మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అమలులో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రాజెక్టు తొలి దశలో చేపట్టనున్న పనులకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణ వ్యయాన్ని మినహాయించి ఈ నిధులతో ప్రాధాన్య కారిడార్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

ప్రాజెక్టు కింద మొత్తం 21 కి.మీ. ప్రాధాన్య స్ట్రెచ్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో హిమాయత్‌ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.20 కి.మీ., ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.80 కి.మీ. పరిధిలో రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులను జోన్-1A, జోన్-1B కారిడార్లలో అమలు చేయనున్నారు. ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధుల్లో రూ.4,500 కోట్లను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) రుణంగా అందించనుంది. మిగిలిన రూ.2,845.12 కోట్లను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA), తెలంగాణ గ్లోబల్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) రుణాల ద్వారా సమకూర్చనున్నాయి.

మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పనులను EPC (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కంస్ట్రక్షన్) విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రాజెక్టు అమలును పర్యవేక్షించేందుకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ (PMC) నియామకానికి కూడా ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు, కొనుగోలు ప్రక్రియ మొత్తం ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ప్రాజెక్టు అమలుకు సంబంధించిన తదుపరి చర్యలను వేగవంతంగా చేపట్టాలని మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL)ను ఆదేశించింది.