Babu Mohan’s Son Uday Babu Mohan Joins BRS Today: ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్ తనయుడు ఉదయ్ బాబు మోహన్ బీఆర్‌ఎస్‌లో చేరారు. నేడు మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకొన్నారు. ఉదయ్‌తో పాటు ఆందోల్, జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకుర్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి హరీశ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో ఉదయ్ బాబు మోహన్ ఆందోల్ నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ కూడా తన కొడుక్కే టికెట్ ఇవ్వాలని హైకమాండ్‌ను అభ్యర్థించారు. కానీ అధిష్ఠానం అందుకు ససేమిరా అంది. చివరికి బాబు మోహన్‌కే బీజేపీ అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఉదయ్.. బీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నేడు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
2014లో బీఆర్‌ఎస్ పార్టీలో సినీ నటుడు బాబు మోహన్ చేరారు. ఆ ఎన్నికల్లో ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018లో ముందస్తు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో బీజేపీలోకి వెళ్లిన బాబు మోహన్.. ఆ పార్టీ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. మళ్లి బీజేపీ అధిష్ఠానం ఈసారి ఆయనకే టికెట్ ఇచ్చింది.