Brother kills Sister for making YouTube Videos in Mahbubabad: సొంత చెల్లినే ఓ అన్న రోకలిబండతో కొట్టి చంపాడు. యూట్యూబ్ వీడియోలు చేస్తోందన్న ఆగ్రహంతో చెల్లెలిపై రోకలిబండతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ విషాద ఘటన కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో మృతురాలి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి.. ఇల్లెందు మండలం రాజీవ్ నగర్ తండాకు చెందిన అజ్మీరా సింధు అలియాస్ సంఘవి (20) మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ వైద్య ఆస్పత్రిలో అప్రెంటిస్ పనిచేస్తోంది. సింధు తండ్రి అజ్మీరా శంకర్ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెంచాడు. తల్లి అజ్మీరా దేవి కూలీ పనులకు వెళుతుంటుంది. సింధుకు అన్న అజ్మీరా హరిలాల్ ఉన్నాడు. సింధు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేది.
సింధు నర్సుగా పనిచేస్తూనే.. సరదాగా యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తుండేది. యూట్యూబ్‌లో వీడియోస్ చేయడం ఆమె అన్న హరిలాల్‌కు నచ్చలేదు. యూట్యూబ్‌లో వీడియోస్ పోస్ట్ చేయడంతో ఇంటి పరువు పోతుందని హరిలాల్ కొన్నేళ్లుగా సింధుతో గొడవ పడుతున్నాడు. అయినా సింధు వీడియోస్ చేయడం మాత్రం మానలేదు. ఈ విషయంపై అన్నా, చెల్లి సోమవారం తీవ్ర స్థాయిలో గొడవపడ్డారు. వీడియోస్ అన్ని డిలేట్ చేయాలనీ, ఇకపై వీడియోలు చేయొద్దని హెచ్చరించాడు. ఇందుకు సింధు అస్సలు అంగీకరించలేదు.
అన్నా, చెల్లి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన హరిలాల్ ఇంట్లో ఉన్న రోకలిబండతో చెల్లి సింధు తలపై కొట్టాడు. దాంతో సింధు తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు ఆమెను ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం వైద్యశాలకు తరలిస్తుండగా.. సింధు మార్గమధ్యలోనే మృతి చెందింది. సింధు రాయి తగిలి చనిపోయిందని కుటుంబ సభ్యులు నమ్మించే ప్రయత్నం చేయగా.. గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీసులను పిలవడంతో అసలు విషయం బయటపడింది. హరిలాల్ పరార్ కాగా.. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
Also Read: MS Dhoni: వైరల్ అవుతున్న ధోని అపాయింట్‌మెంట్ లెటర్.. జీతం ఎంతో తెలుసా?