NTV Telugu Site icon

Telangana Congress: నేడు సీఎం అధ్యక్షతన కాంగ్రెస్‌ సీఎల్పీ సమావేశం..

Revanth Reddy

Revanth Reddy

Telangana Congress: హైదరాబాద్‌లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ముఖ్యాంశాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, రాష్ట్ర బడ్జెట్‌పై చర్చించనున్నట్లు సమాచారం. రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో విశ్లేషణ జరగనుంది. సమావేశం నాంది మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమవుతుంది. ముందుగా పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ సమావేశమవుతారు. అనంతరం జిల్లాల వారీగా భేటీలు జరుగుతాయి. మొదట ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలతో చర్చ జరుగుతుంది. తర్వాత కరీంనగర్‌, వరంగల్‌, అనంతరం నల్గొండ, హైదరాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఈ భేటీలకు ఆయా జిల్లాల్లోని మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు కూడా హాజరవుతారు.

Also Read: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

అన్ని జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం పెంచడమే ఈ భేటీల ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాల నుండి సమాచారం. నియోజకవర్గ స్థాయిలో తలెత్తుతున్న విభేదాలను పరిష్కరించేందుకు, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంపై పార్టీ దృష్టిపెట్టనుంది. సంక్రాంతి అనంతరం కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ముఖ్యమంత్రి, మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలు ప్రస్తావించారు. కొందరు మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా సీఎం రేవంత్‌ ఈ నెల 1న మంత్రులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. నిధుల వినియోగం, మార్చి వరకు ప్రభుత్వ ప్రాధాన్యాలను స్పష్టంగా తెలియజేశారు. అలాగే, ఎమ్మెల్యేల వ్యవహారశైలి, మంత్రుల మధ్య సమన్వయం, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై చర్చించారు.

Also Read: Ram Charan RC 16: రామ్ చరణ్ RC 16 షూట్ కి స్పెషల్ గెస్ట్

కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పనులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తిని అధిగమించడానికి, పార్టీ కేడర్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి గురువారం సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్‌ సమావేశాలకు ప్రణాళికలు రూపొందించే సదవకాశంగా మారనుంది.