Revanth Reddy: ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచే తెలంగాణ అభివృద్ధికి గ్లోబల్ పెట్టుబడులు అవసరమన్న దృక్పథంతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశీ పర్యటనలు ప్రారంభించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం జపాన్ పర్యటనకు నేడు వెళ్లనుంది. నేటి (ఏప్రిల్ 16) నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి టోక్యో, మౌంట్ ఫ్యూజీ, ఒసాకా, హిరోషిమా నగరాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పెషల్ సెక్రటరీ జయేశ్ రంజన్ కూడా వెళ్లనున్నారు. గతంలో దావోస్‌లో జరిగిన ఆర్థిక సదస్సులో కూడా సీఎం రేవంత్ పెట్టుబడుల కోసం పాల్గొని అనేక పెట్టుబడులను సాధించారు.
టోక్యోలోని వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతున్నారు. ఏప్రిల్ 17న తోషిబా ఫ్యాక్టరీని సందర్శించి కంపెనీ కార్యకలాపాలపై అవగాహన పొందనున్నారు. ఏప్రిల్ 18న గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి.. టోక్యో గవర్నర్‌తో సమావేశం, పారిశ్రామికవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశం జరపనున్నారు. ఆ తర్వాత ప్రముఖ కంపినీలైన టొయోటా, తోషిబా, ఐసిన్, ఎన్టీటీ సంస్థల సీఈఓ లతో వరుస భేటీలు షెడ్యూల్ అయ్యాయి.
ఆపై సీఎం రేవంత్ రెడ్డి సుమిదా రివర్ ఫ్రంట్, మౌంట్ ఫుజీ, అరకురయామా పార్క్, కిటాక్యూషు సిటీ ఎకో టౌన్ ప్రాజెక్టులు, ఎన్విరాన్‌మెంట్ మ్యూజియం, మురసాకి రివర్ మ్యూజియాలను సందర్శించనున్నారు. అలాగే ఏప్రిల్ 21న ఒసాకాలో జరిగే వరల్డ్ ఎక్స్‌పో – 2025లో తెలంగాణ పవిలియన్‌ను సీఎం అధికారికంగా ప్రారంభించనున్నారు. అదేరోజు బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక జపాన్ పర్యటన చివరరి రోజు ఏప్రిల్ 22న హిరోషిమా చేరుకుని పీస్ మెమోరియల్ సందర్శన, గాంధీ విగ్రహానికి పుష్పాంజలి, హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్‌లతో భేటీలు జరుగనున్నాయి. మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీ, హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని కూడా సందర్శించి చర్చలు జరుపనున్నారు.