Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పారదర్శకంగా, శాస్త్రీయంగా కుల గణన సర్వేను నిర్వహిస్తున్నప్పటికీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దీనిపై రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సర్వే పూర్తిగా సమగ్రంగా, జాతీయ ప్రామాణికాలతో నిర్వహించబడుతోందని, అందుకు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరించారని తెలిపారు. మొత్తం కోటి 12 లక్షల ఇళ్లను సందర్శించి సర్వే నిర్వహించామని, ఆ సర్వే నివేదికను శాసనసభలో చర్చకు పెట్టామని ఆయన వివరించారు.
అయితే, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుల గణన సర్వేకు తగిన సమాచారం ఇవ్వకుండా సభ నుంచి నిరసనగా వాకౌట్ చేయడం విస్మయానికి గురిచేస్తోందని అన్నారు. బలహీన వర్గాల అభివృద్ధికి నిజంగా కట్టుబడి ఉంటే, ఈ సర్వేను సమర్థించాల్సిందిగా సూచించారు. “ప్రతిపక్ష నాయకులు కేసీఆర్, ఉప పక్ష నాయకులు హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్— వీరిలో ఒక్కరు అయినా బీసీలకు లేదా ఎస్సీలకు ఒక్క పదవైనా ఇచ్చారా?” అని మంత్రి ప్రశ్నించారు.
Dhoni House: ధోనీ ఇళ్లు డిజైన్ చూశారా.. గోడపై జెర్సీ నెంబర్ 7, హెలికాప్టర్ షాట్
బీజేపీ పక్షపాతం నెరవేర్చే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించిన మంత్రి, బీజేపీ బీసీ వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించిందని, అయితే చివరికి శాసనసభ పక్ష నాయకుడిగా రెడ్డిని ఎంపిక చేయడం సాక్షాత్తూ వారి వంచనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా మతపరమైన విధ్వంసాలు సృష్టించి ఓట్ల రాజకీయాలు చేయడమే బీజేపీ ముఖ్య లక్ష్యమని ఆరోపించారు. అయోధ్య రామాలయాన్ని కూడా ఎన్నికల రాజకీయాలకు వాడుకుంటూ బీజేపీ అసలు ధోరణి బయటపడిందని అన్నారు.
కుల గణన సర్వే దేశానికి కొత్తది కాదని, 1931లోనే ఇలాంటి సర్వే ఒకసారి నిర్వహించారని మంత్రి గుర్తుచేశారు. 2011 జనాభా లెక్కలు సర్వే జరిగినప్పటికీ, 2021లో జరగాల్సిన జనగణన కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యం అయ్యిందని చెప్పారు. “కుల గణన సర్వే ప్రారంభించాక, కొంత మంది అంకెలు లేవని విమర్శించారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో డేటా లభ్యమైందని, తెలంగాణలో 56% మంది బీసీలుగా ఉన్నారని తేలిందని” మంత్రి తెలిపారు.
ఈ సర్వే పూర్తిగా శాస్త్రీయ, చట్టబద్ధ విధానంలోనే నిర్వహించామని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మొదటి దశ నుంచి నివేదిక సిద్ధం చేసే వరకు పూర్తి పారదర్శకత పాటించిందని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అనుమానాలకు తావులేదని పేర్కొన్నారు. కుల గణన సర్వే అమలు ద్వారా బలహీనవర్గాలకు గౌరవప్రదమైన ప్రాతినిధ్యం పెరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.
Central Cabinet Decisions: స్కిల్ ఇండియా కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం