Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..

Telangana

Telangana

Telangana Cabinet: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ప్రజా సంక్షేమం, పరిపాలన సంస్కరణలు, మౌలిక వసతుల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు, విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు వీలుగా పలు కొత్త పోస్టుల భర్తీకి క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. అలాగే, పఠాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు అవసరమైన భూమిని కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతిక కారణాలు, ప్రయాణికులకు మరింత లబ్ధి చేకూర్చేలా బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్పు ప్రతిపాదనకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే ధరణిపై దర్యాప్తునకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయడంతో పాటు ధరణి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ క్యాబినెట్ సమావేశంలో గ్రామీణ పల్లెల స్వయంప్రతిపత్తిని బలోపేతం చేసే దిశగా అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా చట్టంలోని సెక్షన్ 70(3)ను సవరించనున్నారు. ఇప్పటివరకు గ్రామ పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయం (పన్నులు, ఇతర వనరుల ద్వారా వచ్చే నిధులు) ప్రభుత్వ ట్రెజరీలో జమ అయ్యేవి. దీనివల్ల అత్యవసర గ్రామ వికాస పనులకు నిధులు డ్రా చేయడం సర్పంచులు లేదా స్థానిక అధికారులకు ఆలస్యమయ్యేది. ఈ ఇబ్బందులను తొలగిస్తూ, ఇకపై గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీతో సంబంధం లేకుండా నేరుగా సదరు గ్రామ పంచాయతీ (GP) బ్యాంక్ ఖాతాలోనే జమ చేసుకునేలా చట్ట సవరణకు ఆమోదం లభించింది. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు మరింత వేగంగా జరగడానికి వీలవుతుంది. ఈ చట్ట సవరణను తక్షణమే అమలుల్లోకి తీసుకువచ్చేందుకు వీలుగా ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేయనుంది.