Telangana Assembly : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై తెలంగాణ శాసనసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పారదర్శక సంప్రదింపులు లేకుండానే కేంద్రం ఈ కసరత్తును కొనసాగిస్తోందని సభ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, పునర్విభజన విషయంలో రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని, ప్రస్తుత సరిహద్దుల్లో మార్పులు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది.
పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని తీర్మానంలో స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోకుండా చర్యలు తీసుకోవాలని సభ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, జనాభా నియంత్రణ అమలు చేసిన రాష్ట్రాలు నష్టపోకూడదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని, తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ సీట్లు పెంచాలని, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు పెంచాలని సభ కోరింది. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు తక్షణమే చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్, సిక్కిం పునర్విభజన ఉదాహరణలను ప్రస్తావిస్తూ, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లకుండా నిర్ణయాలు తీసుకోవాలని సభ డిమాండ్ చేసింది.
ఈ తీర్మానం ద్వారా తెలంగాణ శాసనసభ, దక్షిణాది రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు బలమైన సంకేతం పంపిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఐక్యంగా నిలవాలని సూచించారు.
Immigration Bill: ఇమ్మిగ్రేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు