Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ (TG Assembly) సమావేశాల్లో శనివారం మధ్యాహ్నం ఉత్కంఠభరితమైన చర్చ చోటుచేసుకుంది. రైతు సమస్యలు, రుణమాఫీ, వడ్ల బోనస్ అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. కౌశిక్ రెడ్డికి మంత్రి సీతక్క కౌంటర్ ఇస్తూ – “నీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు. నా నియోజకవర్గంలో నేను తిరిగిన విధంగా నువ్వు తిరగలేవు” అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో తేల్చుకుందామని సవాలు విసిరారు.
వడ్ల బోనస్ ఇవ్వడం లేదని కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి సీతక్క ఖండించారు. “హైదరాబాద్‌లో తిరిగే వాళ్లకు రైతులకు బోనస్ వస్తుందో లేదో ఎలా తెలుస్తుంది? బోనస్ ఇస్తామని బోగస్ చేసిందీ మీరు.. వరివేస్తే ఉరి అన్నది మీరు” అని తీవ్రస్థాయిలో స్పందించారు.
తాను ప్రభుత్వ క్వార్టర్స్‌లోనే నివసిస్తున్నానని, వైఎస్ఆర్ హయాంలో నిర్మించిన భవనంలో ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి స్పష్టం చేశారు. తన కుమారుడు కూడా హన్మకొండలోనే ఉంటాడని, తన జీవన విధానం ప్రజలకు బాగా తెలుసని అన్నారు. “మీ లాగా ఎకరాల విస్తీర్ణంలో కోటల్లో నివసించను” అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, గత బడ్జెట్‌లో రైతు రుణమాఫీకి ₹31 వేల కోట్లు కేటాయించామని, కానీ ఇప్పటి వరకు కేవలం ₹20,616 కోట్లు మాత్రమే మాఫీ చేశారని ఆరోపించారు. తన నియోజకవర్గమైన హుజురాబాద్‌లో 1070 మంది రైతులు రుణాలు తీసుకున్నప్పటికీ, కేవలం 495 మందికే మాఫీ అందిందని తెలిపారు. ఇంకా 50% మందికి రుణమాఫీ కాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
కేసీఆర్ హయాంలో రూ. 29,114 కోట్ల రుణమాఫీ చేశామని, రైతు బంధు లాంటి గొప్ప పథకాన్ని అమలు చేశామని కౌశిక్ రెడ్డి గుర్తుచేశారు. అయితే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని రెండు సీజన్లలో నిలిపివేసి, మూడో సీజన్లో రైతు భరోసా కింద ₹15 వేలు ఇస్తామని చెప్పి కేవలం ₹12 వేలు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. రైతులకు ఇచ్చే బోనస్ బోగస్‌గా మారిందని ఆయన తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
SJ Suryah: ఆరోజే సూసైడ్ చేసుకునే వాడిని.. ఎస్జే సూర్య షాకింగ్ కామెంట్స్!