తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం ఐదవ రోజు వాడివేడిగా సమావేశం జరగనుంది. నేడు అసెంబ్లీలో నాలుగు ప్రభుత్వ బిల్లులతో సహా భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది. తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నేడు అసెంబ్లీలో ప్రభుత్వ అప్పులు, చెల్లింపులపై సహా రైతు భరోసాపై చర్చ జరగనుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 'ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 317 జీవో తెచ్చుకున్నాము. 317 జీవో వల్ల సమస్యలు ఉన్నాయి అని చెబుతున్నారు. సమస్యలు ఉన్నాయి అని చెప్పడమే కాకుండా.. పరిష్కారం కూడా చూపండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది. మీరు ఎం చేస్తున్నారు?, ఇంకా మమ్మల్ని పాయింటవుట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది' అని కవిత అన్నారు.
బీఆర్ఎస్ వాళ్లు రోజుకో బాగోతాలు వేస్తున్నారు అని ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఫైర్ అయ్యారు. ఇసుక దోపిడీ, భూములు దోపిడీ చేసి ఇవాళ వేషాలు వేస్తున్నారన్నారని విమర్శించారు. ఆటోలో వచ్చి.. ఎంత మంది ఆటో వాళ్లకు మేలు చేశారు? అని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికులు 34 మంది చనిపోవడానికి కారణం మీరు కాదా? అని ప్రశ్నించారు.
సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య వాడీవేడి సంభాషణ సాగింది. హరీశ్ రావు డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా?.. ఏ హోదాలో మాట్లాడుతున్నారు? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు రాకపోవడం సభకే కాదు.. తెలంగాణ ప్రజలను అవమానపరచడమే అని కోమటిరెడ్డి మండిపడ్డారు.
మాల మహానాడు ప్రతినిధులు అసెంబ్లీని ముట్టడించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీలో మాదిగ కులస్తులకు మద్దతుగా సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా మాల మహానాడు ప్రతినిధులు ముట్టడించారు.
సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. 'నల్గొండలో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసిన మా వాళ్లు భారీ మెజార్టీతో గెలిచారు. గత ప్రభుత్వం నల్గొండ జిల్లాను పట్టించుకోలేదు. గందమల్ల రిజర్వాయర్ పనులు పక్కన పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి మా జిల్లాకు అండగా ఉన్నారు. ఆయనకు ధన్యవాదాలు' అని కోమటిరెడ్డి అన్నారు.
సభ నియమాలు పాటించాలని సభ్యులను స్పీకర్ కోరారు. ఫ్లకార్డుల ప్రదర్శన వద్దని, మనం రూపొందించుకున్న నిబంధనలు మనమే ఉల్లంగించవద్దన్నారు.
రైతాంగ సమస్యలపై రైతు కండువాలు వేసుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వచ్చారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్‌పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. 317 జీవో, ఉద్యోగులను సొంత జిల్లాలకు పంపే అంశంపై శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానం కోరింది.
తెలంగాణ శాసన మండలి ప్రారంభమైంది. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ కమిటీ హల్లో కాసేపట్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశం కానున్నారు.
రాష్ట్రంలోని రైతులకు పూర్తిగా రుణ మాఫీ చేయాలని, పంట సాయం రూ.15 వేలు ఇచ్చే అంశంపై చర్చించాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం కోరనుంది.
బీజేపీ ఎమ్మెల్యేలు ఎడ్ల బండిపై అసెంబ్లీకి రానున్నారు. రైతు హమీలు అమలు చేయలేదని నిరసనగా ఎడ్ల బండిపై అసెంబ్లీకి వస్తున్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి ఎడ్ల బండిపై అసెంబ్లీకి రానున్నారు. నిన్న రైతు హామీలపై చర్చించాలని వాయిదా తీర్మానం బీజేపీ కోరగా.. ఆ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.
అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ భేటీ నిర్వహించనున్నారు. గంట ముందుగానే అసెంబ్లీకి రానున్న సీఎం.. కీలకాంశాలపై సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ అసెంబ్లీలో భూ భారతి, రైతు భరోసాపై చర్చ జరగనుంది.
నేడు అసెంబ్లీలో నాలుగు ప్రభుత్వ బిల్లులతో సహా భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది. తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నేడు అసెంబ్లీలో ప్రభుత్వ అప్పులు, చెల్లింపులపై సహా రైతు భరోసాపై చర్చ జరగనుంది.