Bihar Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఆయన ముస్లింలు అధికంగా నివసించే కతిహార్, కిషన్గంజ్ ప్రాంతాలలో జరిగిన బహిరంగ సభలలో మాట్లాడుతూ.. ఒక ప్రధాన రాజకీయ ప్రకటన చేశారు. బీహార్లో అఖిల భారత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ (సవరణ) చట్టాన్ని చెత్తబుట్టలో పడేస్తామని చెప్పారు.
READ ALSO: Napoleon Returns : ‘నెపోలియన్’ రిటర్న్స్’ గ్లింప్స్ రిలీజ్..
తేజస్వి ఏం చెప్పారంటే..
తేజస్వి మాట్లాడుతూ, “నా తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పుడూ మతతత్వ శక్తులతో రాజీపడలేదు. కానీ నితీష్ కుమార్ ఎప్పుడూ అలాంటి శక్తులతోనే ఉన్నారు. ఆయన కారణంగానే ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. బీజేపీని భారత్ జలావ్ పార్టీ అని పిలవాలి” అని ఆయన అన్నారు. “ఈ ఎన్నికలు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సోదరభావాన్ని కాపాడటానికి జరుగుతున్న పోరాటం. 20 ఏళ్లుగా నితీష్ కుమార్ పాలనతో ప్రజలు విసుగు చెందారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖలోనూ అవినీతి విపరీతంగా పెరిగిపోయింది, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయి” అని అన్నారు. నితీష్ కుమార్, నరేంద్ర మోడీలు సుదీర్ఘ కాలంగా పాలనలో ఉన్నప్పటికీ బీహార్ ఇప్పటికీ దేశంలో అత్యంత పేద, వెనుకబడిన రాష్ట్రంగా ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడితే, సీమాంచల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం సీమాంచల్, ఇప్పుడు వారిని జవాబుదారీగా ఉంచాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు.
ఇదే సమయంలో శనివారం ఆర్జేడీ ఎమ్మెల్సీ మహ్మద్ ఖారీ సోహైబ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితే, వక్ఫ్ బిల్లుతో సహా అన్ని బిల్లులను చింపి పారవేస్తారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తరువాతి రోజే ఏకంగా తేజస్వి యాదవ్ వక్ఫ్ బిల్లుపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యింది. అయితే.. ఒక ముఖ్యమంత్రి కేంద్ర చట్టాన్ని ఎలా రద్దు చేయగలరని బీజేపీ ప్రశ్నిస్తుంది. ఏప్రిల్లో పార్లమెంటు వక్ఫ్ (సవరణ) చట్టం, 2024ను ఆమోదించిన తర్వాత తాజాగా తేజస్వి యాదవ్ ఈ ప్రకటన చేశారు. అయితే NDA ప్రభుత్వం దీనిని ముస్లిం సమాజం, వెనుకబడిన వర్గాలు, మహిళలకు అధికారం కల్పించే పారదర్శక చట్టంగా అభివర్ణించింది. కానీ ఈ చట్టం ముస్లింల మతపరమైన, ఆస్తి హక్కులను ఉల్లంఘిస్తుందని ప్రతిపక్షం వాదిస్తోంది.
READ ALSO: PKK Turkey Peace: తుర్కియేలో 40 ఏళ్ల పోరాటానికి ముగింపు..