Madras High Court: విద్యార్థి తన జీవితాన్ని అంతం చేసుకునేందుకు తీవ్ర చర్యలు తీసుకుంటే ఉపాధ్యాయులను మాత్రమే నిందించకూడదని, వారి భవిష్యత్తును రూపొందించడంలో తల్లిదండ్రులు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తారని మద్రాసు హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది.తమ పిల్లలకు ఇంటి లోపల, వెలుపల మంచి వాతావరణాన్ని సృష్టించే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, ఇది చాలా ముఖ్యమైనదని కోర్టు తెలిపింది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఏదైనా నేరం చేసినట్లు లేదా పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు నిర్ధారించడానికి ఆధారాలు ఉంటే మాత్రమే వారిని నిందించవచ్చు అని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చిన్నారులు ఆత్మహత్యలు చేసుకునే ట్రెండ్ పెరిగిపోయింది. కావున వారి విధులను సక్రమంగా నిర్వహించి పిల్లలకు మంచి భవిష్యత్‌ను అందించడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల విధి అని జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణ్యం అన్నారు.
తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడినందుకు గాను, పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై రూ.10 లక్షల నష్టపరిహారంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కె.కాలా చేసిన రిట్ పిటిషన్‌ను బెంచ్ కొట్టివేసింది. పిటిషనర్ ప్రకారం.. రోజూవారీ కూలీలైన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి కుమారుడు యువరాజ్ (17) గూడలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తమ కుమారుడిని వేధించినట్లు.. ఆ వేధింపుల వల్లే తన కుమారుడు 2017లో ఆత్మహత్య చేసుకున్నాడని బాలుడి తల్లి వాదించింది. పిల్లల ఆత్మహత్య ఎవరు బాధ్యులు అని విచారణ చేపట్టి నిర్ధారించాలని న్యాయమూర్తి చెప్పారు. కేవలం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను నిందించడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
Delhi: ఢిల్లీలో తీవ్రమవుతున్న వాయుకాలుష్యం.. వాణిజ్య డీజిల్ ట్రక్కులపై నిషేధం
ఈ కేసులో విద్యాశాఖ, పోలీసు అధికారులు ఇద్దరూ విస్తృతమైన విచారణ జరిపి, వారి సంబంధిత నివేదికలను సమర్పించారు. బాలుడు ఆత్మహత్యకు పాల్పడినందుకు ప్రధానోపాధ్యాయుడు ఎటువంటి ప్రాసిక్యూషన్‌కు బాధ్యత వహించడు. అందువల్ల ఎటువంటి సరైన కారణం లేకుండా ప్రధానోపాధ్యాయుడిని అనవసరంగా లాగి బాధపెట్టారని, పిటిషనర్‌కు జరిమానా విధించడమే సరైనదని న్యాయమూర్తి అన్నారు. పిటిషనర్, ఆమె కుటుంబం పేద దుస్థితిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి అలా చేయడం మానుకున్నారు.