MLC By Election: రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరఫున గెలిచిన షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి అధికారులు ఎన్నికల మెటీరియల్‌ను అందజేస్తున్నారు. ఎన్నికల మెటీరియల్ పంపిణీకి పీవో, ఏపీవో, ఓపీవో, మైక్రో అబ్జర్వర్లు, సెక్టార్ అధికారులు హాజరయ్యారు. ఈ ఉపఎన్నికలో 16,737 మంది టీచర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఆరు జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్ చేపట్టనున్నారు.
Read Also: Firing At Golden Temple premises: స్వర్ణ దేవాలయంలో కాల్పులు.. తృటిలో తప్పించుకున్న నేత
ఐదుగురు అభ్యర్థులు స్వతంత్రంగా బరిలో ఉండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఐదుగురిలో ఇద్దరి మధ్యే హోరాహోరీ పోటీ నెలకొననుందని అంచనా. హోరాహోరీగా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం 4 గంటలతో ముగిసింది. కాకినాడ జిల్లాలో 3418 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 2990, డాక్టరు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 3296, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 637, పశ్చిమగోదావరి జిల్లాలో 3729,ఏలూరు జిల్లాలో 2667 మంది ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నిక స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ షన్మోహన్ అధికారులను ఆదేశించారు.