బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ రాజకీయం ఆసక్తిగా మారింది. చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై టీడీపీ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్ జరగనుంది. మున్సిపల్ చైర్మన్ జంజనం ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పదవీ గండం నుంచి తప్పించుకోవాలని వైసీపీని వీడి టీడీపీలో చేరినా.. అవిశ్వాసం ఎదుర్కోక జంజనంకు తప్పడం లేదు.
చైర్మన్‌గా జంజనం శ్రీనివాసరావును దించేందుకు పలువురు టీడీపీ, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గ కౌన్సిలర్లు పావులు కదుపుతున్నారు. నేడు క్యాంప్ నుంచి నేరుగా కౌన్సిలర్లు ఓటింగ్‌కు రానున్నారు. అవిశ్వాసం నెగ్గితే చైర్మన్ రేసులో ముగ్గురు నేతలు ఉన్నారు. ప్రస్తుతం చీరాల మున్సిపల్ రాజకీయాలు గజిబిజిగా ఉన్నాయి. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అటు నేతల్లో, ఇటు జనాల్లో నెలకొంది.
2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 33 వార్డులకు గానూ.. అత్యధిక వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లు గెలుపొందారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో.. రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. చాలా మంది వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి.. టీడీపీలోకి వచ్చేశారు. దీంతో మున్సిపల్ శాఖలో అనూహ్యంగా టీడీపీ బలం పుంజుకుంది. 33 మంది కౌన్సిలర్లలో టీడీపీకి అనుకూలంగా 15కు పైగా మంది సభ్యులు ఉన్నారు. మరో ముగ్గురు, నలుగురు కూడా టీడీపీకి మద్దతుగా ఉన్నారని అంటున్నారు. దాంతో చీరాల మున్సిపల్ రాజకీయం ఆసక్తిగా మారింది.