మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అనకాపల్లిలోని పరవాడ మండలంలోని వెన్నెలపాలెంలో భారీగా పోలీసులు మోహరించారు. అటు టీడీపీ శ్రేణులు కూడా బండారు ఇంటి దగ్గరకు చేరుకుంటున్నాయి. దీంతో ఇరు వర్గాల మోహరింపుతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడుతోంది. నిన్న (ఆదివారం) రాత్రి పది గంటల తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అటువైపుగా ఎవర్నీ రాకుండా అడ్డుకున్నారు. అయితే.. బండారు ఇంటివైపు ఎవరు రాకుండా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Read Also: PVR Shares: ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపెట్టేందుకు రాబోతున్నాయ్..జవాన్, టైగర్ 3, యానిమల్, సలార్
నందమూరి, నారా కుటుంబాలపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఘాటు విమర్శలు చేశారు. ఎన్టీఆర్ కుటుంబంపై, భువనేశ్వరి, బ్రాహ్మణీలపై మాట్లాడే అర్హత నీకు లేదు.. రోజా.. నువ్వు సినిమాల్లో ఎలా నటించావో నాకు తెలుసు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ చరిత్ర ఎవరికి తెలియదు.. నీ బాగోతం బయటపెడితే నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారు అని విమర్శించారు. ఇక, మంత్రి రోజాపై చేసిన బండారు కామెంట్స్ వైరల్ గా మారడంతో.. మహిళా కమిషన్ స్పందించింది.. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.. 41ఏ కింద నోటీసులు ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. దీంతో మాజీ మంత్రి, బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. ఇక, వెన్నెలపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.