జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం ముగింపు దశకు వచ్చేసింది. కానీ… ఏపీ కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ మాత్రం బీజేపీకి ఇంతవరకు బహిరంగ మద్దతు ప్రకటించలేదు. ఎందుకలా? టీడీపీ మద్దతు తెలంగాణలో తమకు చేటు చేస్తుందని కాషాయ దళం భయపడుతోందా? లేక ఇంకేవైనా ఇతర కారణాలున్నాయా? బంధువులిద్దరూ కామన్ ఫంక్షన్‌లో సంబంధంలేకుండా తిరిగినట్టు ఎందుకు మారింది పరిస్థితి?
Also Read:DSP Richa Ghosh: టీమిండియాలో మరో డిఎస్పీ.. నియామకపత్రం అందజేత..
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయి. ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉంది. కేంద్రంతో ఆ పార్టీకి మంచి సంబంధాలున్నాయి, ఢిల్లీ, అమరావతిలో రెండు పార్టీలు కలిసి అధికారం పంచుకుంటున్నాయి కూడా. ఆల్ ఈజ్ వెల్. కానీ… జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గరికి వచ్చేసరికి ఎక్కడో తేడా కొడుతోంది. ఏపీ సంబంధాలతో నిమిత్తం లేకుండా ఇక్కడి వ్యవహారాలు జరిగిపోతున్నాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి టీడీపీ బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు సరికదా… ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉంది. ప్రచారం ముగింపు దశకు వచ్చిన టైంలో ఇప్పుడు ఈ సంబంధాల గురించిన చర్చ ఎక్కువగా జరుగుతోంది నియోజకవర్గంలో. అయితే రెండు పార్టీలు అలా… మనసులో ప్రేమలున్నా పైకి ప్రకటించకపోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయంటున్నారు పొలిటికల్ పండిట్స్.
తెలంగాణాలో టీడీపీ బీజేపీ కోసం ప్రచారం చేస్తే… అది బీఆర్‌ఎస్‌కు ప్లస్ అవుతుందన్న అంచనాలున్నాయి. కారు పార్టీ మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ వాదాన్ని తెర మీదికి తీసుకువస్తే… తమకు ఎఫెక్ట్ పడుతుందన్న భయం బీజేపీ వర్గాల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. బనకచర్ల సహా… వివిధ ప్రాజెక్ట్‌ల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను గట్టిగా తప్పు పట్టింది బీఆర్‌ఎస్. ఈ క్రమంలో… చంద్రబాబును బూచిగా చూపించి…బీఆర్‌ఎస్ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందన్నది బీజేపీ భయంగా తెలుస్తోంది. అందుకే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దూరంగా పెట్టినట్టు తెలుస్తోంది. అదీగాక… ఒక వేళ టీడీపీ లీడర్స్ ఇక్కడ ప్రచారం చేసినా… పెద్దగా కలిసొచ్చి బీభత్సమైన మార్పులేమీ జరిగిపోవన్నది కూడా కాషాయ దళం లెక్క అట.
టీడీపీ ప్రచారం చేయడం వల్ల ఓట్లు చీలిపోయి ఎవరి వైపు టర్న్ అవుతాయో కూడా తెలియని పరిస్థితి ఉందని, అందుకే జూబ్లీహిల్స్‌లో సైకిల్ తొక్కడం కష్టమని భావించి ప్రచారం చెయ్యకుండా సైలెంట్‌గా ఉంచడమే బెటర్ అని భావించారట బీజేపీ పెద్దలు. అందులోనూ బీజేపీ ఇప్పుడు తెలంగాణలో మరింతగా బలపడాలనే ఆలోచనలో ఉంది. ఇలాంటి సమయంలో టీడీపీతో కలిసి జూబ్లీహిల్స్‌లో ముందుకు వెళ్తే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రభావం ఉంటుందోనన్న ఆలోచన కూడా ఉందట బీజేపీకి.
ఇప్పుడు టీడీపీతో కలిసి ప్రచారం చేస్తే… భవిష్యత్‌లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ సొంతంగా ఎదగడానికి ఇబ్బందులు ఉంటాయని, అందుకనే మన ప్రేమల్ని మనలోనే దాచుకుని లోపాయికారీ మద్దతుతో ముందుకు వెళ్లడం బెటర్ అని బీజేపీ నాయకత్వం అనుకున్నట్టు సమాచారం. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఉభయకుశలోపరిగా… టీడీపీ పెద్దలు కూడా కామ్‌గా చేయాల్సిన సాయం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకే బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేసే రోజు తప్ప… మిగతా ఎక్కడా ప్రచారంలో కూడా టీడీపీ జెండాలు కనిపించలేదు. అయితే… పోలింగ్ రోజున ఏం చేయాలో తమ నేతలకు టీడీపీ పెద్దలు సూచిస్తున్నట్టు సమాచారం.
