MP Rammohan Naidu: ఏపీలో కరువు విలయతాండవం చేస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, సీఎం జగన్ కనీసం స్పందించడం లేదన్నారు. బాబు సీఎంగా ఉన్న సమయంలో కరువు వస్తే , కరువు మండలాలు ప్రకటించి ఇన్‌పుట్ సబ్సిడీలు, పంట నష్టపరిహారం అందించామన్నారు. రైతును దగా చేయటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల తీరు చూసి రైతులే ఆశ్చర్యపోతున్నారన్నారు. నాడు 2018 సంవత్సరంలో 275 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించామని.. నేడు 30 శాతం తక్కువ వర్షపాతం ఉంటే , కేవలం 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి ప్రభుత్వం చెయ్యి దులుపు కుంటుందని మండిపడ్డారు.
Also Read: CM YS Jagan: పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు.. వారి కోసం ఎంతో చేస్తున్నాం..
ఇరిగేషన్ , అగ్రికల్చర్ మినిస్టర్స్ ఎక్కడ ఉన్నారని.. ఇరిగేషన్ మంత్రి ఇరిటేషన్ మంత్రిగా మారారన్నారు. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు , ఉన్న కాలువలలో పిడికెడు మట్టి కూడా తీయలేదన్నారు. రైతులు స్వయంగా డబ్బులు ఖర్చు చేసి కాలువలలో పూడిక తీసుకుంటున్నారన్నారు. అగ్రికల్చర్ మినిస్టర్ అసలు ఉన్నాడా అని ఆయన ప్రశ్నించారు. శాఖాపరంగా ఏ మంత్రి ఒక్క అంశం పై మాటాడటం లేదని , బాబుని విమర్శించడమే మంత్రులకు పని అంటూ ఆయన అన్నారు. బస్సు యాత్రలని రాష్ర్టమంతా మంత్రులు తిరుగుతున్నారు , రైతుల గూర్చి మాట్లాడారా అంటూ ప్రశ్నించారు.
వై ఏపీ నీడ్స్ జగన్ అని కార్యక్రమం పెడుతున్నారని.. అధికారులను అడ్డంగా పెట్టుకొని పొలిటికల్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుకుంటున్నామన్నారు. కరువు జిల్లాగా ప్రకటించే సీఎం జగన్ జిల్లాలో అడుగుపెట్టాలన్నారు. ఇద్దరు మినిస్టర్లు , స్పీకర్ ఉండి ఇంత నిర్లక్ష్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వజ్రపుకొత్తూరు ఎడారి అయిపోయిందన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. నాలుగున్నర ఏండ్ల తరువాత నీరు అందించలేక పోవడం టీడీపీ వైఫల్యం అనటం చేతకానితనమన్నారు. ఎంతసేపు బాబుపై ఏం కేసులు వేయాలని ఆలోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.