AP Elections 2024: పల్నాడు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడు కారుపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. ముప్పాళ్ళ మండలం నార్నెపాడులో పోలింగ్ ను పరిశీలించడానికి వెళ్లిన అంబటి అల్లుడు ఉపేష్ కారు పై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇక, ఈ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ముప్పాళ్ళ మండలం నార్నెపాడు గ్రామంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు అంటూ మండిపడ్డారు.
Read Also: Road Accident: కోతి వల్ల రోడ్డు ప్రమాదం.. ముగ్గురు బ్యాంక్ ఉద్యోగుల దుర్మరణం..
చీఫ్ పోలింగ్ ఏజెంట్ అయిన నా అల్లుడుపై దాడికి ప్రయత్నించారు అని మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. నార్నెపాడు గ్రామంలో అధికారులు విచారణ జరిపి రీ- పోలింగ్ నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. ఓడిపోతామని నిరాశతో టీడీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారు.. గ్రామల్లో కూడా వైసీపీ కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లను బూతుల్లో ఉండి వాళ్లే వేసుకుంటున్నారు.. దీనిపై ఎన్నికల అధికారులకు తెలియజేశాం.. జరిగిన దాడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నాము.. ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.