Pithapuram: వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? అనే ఉత్కంఠకు తెరదించుతూ.. పిఠాపురం నుంచి బరిలోకి దిగనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.. అయితే, పవన్ ప్రకటన ఇప్పుడు పిఠాపురం టీడీపీలో అసమ్మతి భగ్గుమనేలా చేసింది.. తానే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించడంతో టీడీపీ కోఆర్డినేటర్ వర్మ అభిమానులు ఆందోళనకు దిగారు.. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలు దగ్ధం చేశారు.. వర్మను టీడీపీ మోసం చేసిందని, వెంటనే పిఠాపురం నుంచి వర్మ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. గెలిచే సీట్లను నాన్ లోకల్ వారికి ఎలా కట్టబెడతారని మండిపడుతున్నారు.
Read Also: Bode Prasad: ఐవీఆర్ఎస్, సర్వేలు బాగున్నా టికెట్ ఇవ్వటం లేదు.. నేను ఏ తప్పు చేశా..!
గతంలో జనసేన కోఆర్డినేటర్ గా వచ్చిన ఉదయ్ శ్రీనివాస్ ను వ్యతిరేకించారు వర్మ.. ఆయనతో కలిసి కార్యక్రమాలు చేయడానికి కూడా ఇష్టపడలేదు.. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే ఆహ్వానిస్తానని, ఆయన నియోజకవర్గానికి రాకుండానే సీటును గెలిపించి గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించారు వర్మ.. కానీ, సడన్ గా సీటు లేకపోవడంతో టెన్షన్ పడుతున్నారు.. అనుచరులు మాత్రం పిఠాపురం టీడీపీ ఆఫీస్ దగ్గర రచ్చ చేశారు.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు.. వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కోరుతున్నారు.. మరోవైపు నియోజకవర్గంలో జనసేన కేడర్ కూడా బైక్ ర్యాలీకి సిద్ధమవుతున్నారు.. స్వయంగా తమ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుంటే ఇలా అసమ్మతి వినిపించడం సరికాదని కోరుతున్నారు.. పొత్తులో ఉన్న పార్టీ అధినేత పోటీ చేస్తే పరిస్థితి ఇలా ఉంటే మిగతా చోట్ల ఎటువంటి పరిస్థితులు ఉంటాయో తెలుస్తుందని అంటున్నారు.. అయితే, 2014లో కూడా ఇదే పరిస్థితి ఎదురైతే వర్మ టీడీపీ రెబెల్ గా పోటీ చేసి గెలుపొందారు.. అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? పోటీ చేస్తే ఏమేరకు ప్రభావం ఉంటుంది అని వర్మ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.