Atchannaidu: మడకశిర తహసీల్దార్ ముర్షావలి సస్పెన్షన్‌పై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మడకశిర తహశీల్దార్ ముర్షావలి అవినీతి అంశంపై మాట్లాడినందుకు సస్పెండ్ చేశారని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏ కారణంతో అయినా లంచం తీసుకోవడం సమర్థనీయం కాదన్నారు. అయితే ముర్షావలి లేవనెత్తిన సమస్యపైనా ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: Aadudam Andhra: ఏపీలో 47 రోజుల పాటు క్రీడా సంబరం.. రేపటి నుంచే ‘ఆడుదాం ఆంధ్రా’
ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ముర్షావలి వివరించారని.. వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయ్యాయో తద్వారా తెలుస్తోందన్నారు. వీడియో ద్వారా ముర్షావల్లి వెల్లడించిన సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ చర్య చూస్తుంటే వ్యాధికి కాకుండా వ్యాధి లక్షణాలకు చికిత్స చేస్తున్నట్లు ఉందని విమర్శించారు. ముర్షావలి సస్పెన్షన్ ఆర్డర్‌ను ఉపసంహరించుకుని సమస్యకు మూలంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలన్నారు. ముర్షావలి ప్రకటన ద్వారా పరిస్థితుల గురించి తెలుసుకొని, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.