Aadudam Andhra: రేపటి నుంచి ఏపీ వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. రేపు గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్‌లో ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. రేపటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు క్రీడా పోటీలు జరగనున్నాయి. ఏపీలో 47 రోజుల పాటు ఈ క్రీడా సంబరం జరగనుంది. గ్రామ వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహించనున్నారు. జీవనశైలిని ప్రోత్సహించడం, ప్రతిభను గుర్తించటం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీపడేలా తీర్చిదిద్దడం, క్రీడా స్పూర్తిని పెంపొందించడం లక్ష్యంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
*ఇప్పటికే పూర్తి అయిన రిజిస్ట్రేషన్లు
*క్రీడాకారులు: 34.19 లక్షలు,
*ప్రేక్షకులు: 88.66 లక్షలు
*రిజిస్ట్రేషన్ చేసుకున్న మొత్తం కోటి 22 లక్షల మంది
*నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలలో బహుమతులు
*బహుమతుల కోసం 12 కోట్లకు పైగా నగదు ఇవ్వనున్న ప్రభుత్వం
సీఎం షెడ్యూల్ ఇదే.. ఆడుదాం ఆంధ్రా లాంచ్
రేపు సీఎం జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు. పదిన్నరకు నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్‌కు సీఎం చేరుకోనున్నారు. అనంతరం శాప్ జెండా, జాతీయ జెండా సీఎం ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. క్రీడా జ్యోతిని వెలిగించి ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం జగన్. క్రీడాకారులతో సీఎం జగన్ ఇంటరాక్షన్ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.