Chandrababu: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం హోదాలో మెగా డీఎస్సీపైనే తొలి సంతకం పెడుతానని ఆయన హామీ ఇచ్చారు. 9 సంవత్సరాల ఐదు నెలలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసే రికార్డు నెలకొల్పానన్నారు. మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటైతే తప్ప తన రికార్డును బ్రేక్ చేయలేరన్నారు. రెండు రాష్ట్రాలు కలవవు.. తన రికార్డ్ ఎవరూ బ్రేక్ చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేతగా కూడా తన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరన్నారు. ఎస్సీలకు న్యాయం చేసేందుకు ఏ,బీ,సీ,డీ వర్గీకరణను టీడీపీ తీసుకొచ్చిందన్నారు. ఏ,బీ,సీ,డీ వర్గీకరణను వైయస్ రాజశేఖర్ రెడ్డి కాపాడ లేకపోయాడన్నారు. దళితులకు ద్రోహం చేసింది… గొంతు కోసింది జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ బటన్ నొక్కింది ఎంత.. బొక్కింది ఎంత అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అని అందరి చెవిలో సీఎం జగన్ పూలు పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులు ఆకర్షించడం మన బ్రాండ్.. పెట్టుబడులు తరిమేయడం జగన్ బ్రాండ్ అంటూ విమర్శించారు.
Read Also: Nallimilli Rama Krishna: టికెట్ దక్కకపోవడంతో కంటతడి పెట్టుకున్న టీడీపీ నేత నల్లమిల్లి
వైయస్ వివేకా హత్యపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో సీఎం జగన్ అబద్దాలు చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. బాబాయిని గొడ్డలి వేటు వేసి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. వైయస్ వివేకా హత్యను హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను మించి పోయే విధంగా రోజుకొక కథ అల్లుతున్నారన్నారు. బెంగళూరులో ఆస్తికి సంబంధించిన సెటిల్మెంట్ వైయస్ వివేకా హత్యకు కారణం అంటున్నారని.. అంతకు ముందు వైయస్ వివేకా రెండో వివాహం.. ఆస్తికోసం అల్లుడుతో వివాదం హత్యకు కారణమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీని, సీఎం జగన్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తాను కూడా సీఎం జగన్ బాధితుడినే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.