కార్టూన్లంటే కవ్విస్తాయి.. మనం ఎంత టెన్షన్ గా వున్నా చక్కిలిగింతలు పెట్టి నవ్విస్తాయి. తెలుగు ప్రేక్షకులకు సరసి చిరపరిచితులు.. సరస్వతుల రామ నరసింహం అంటే చాలామందికి తెలియకపోవచ్చు. పత్రికలు, మేగజైన్లు చదివే వారికి కథల మధ్యలో కనిపించే సరసి కార్టూన్లు చిరకాలం గుర్తుండిపోతాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు గ్రామంలో 1956 జూలై 5న వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టిన సరసి ఎం.ఎ. (ఫిలాసఫి), ఎల్. ఎల్.బి పూర్తి చేసారు. ‘సరసి’ కలం పేరుతో కథా రచనలు, కార్టూన్లు వేస్తుంటారు. గురువు తమ్మా సత్యనారాయణ శిక్షణలో సాంప్రదాయిక చిత్ర కళను నేర్చుకున్నారు సరసి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. రాష్ట్ర శాసనసభలో సహాయ కార్యదర్శిగా పనిచేసి రిటైరయ్యారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే, తనకిష్టమైన చిత్రకళను, కథా రచననూ సాగించారు సరసి. నాలుగు వందలకు పైగా కథలు, వేలాది సంఖ్యలో కార్టూన్లను వెలువరించారు సరసి. ఆయన కథలు పలు మాస, వార పత్రికల్లో ప్రచురితమయ్యాయి. నవ్య వారపత్రికలో పన్నెండేళ్ళ పాటు మనమీదేనర్రోయ్ పేరుతో వేసిన కార్టూన్లను, అదే పేరుతో రెండు సంపుటాలుగా ప్రచురించాడు. ‘సరసి కార్టూన్లు’ పేరుతో నాలుగు సంపుటాలు ప్రచురించారు. తాజాగా ఆయనకు ప్రముఖ పురస్కారం వరించింది. సినీ కవి, రచయిత, పత్రికా సంపాదకుడు తాపీ ధర్మారావు జాతీయ పురస్కారానికి హైదరాబాద్ కి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ సరసి ఎంపికయ్యారు. సరస్వతుల రామనరసింహంని ఈఅవార్డుకి ఎంపిక చేయడం పట్ల కార్టూనిస్టులు, రచయితలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు జాతి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సామల రమేష్ బాబు కార్టూనిస్ట్ సరసికి అవార్డు ప్రదానం చేస్తున్నామని ప్రకటించారు.
విజయవాడలో నవంబర్ లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేస్తామని వివరించారు. అదే సభలో సరసి గీసిన కార్టూన్లు సంకలనం ‘అమ్మనుడిని అటకెక్కిస్తారా’ ఆవిష్కరిస్తామన్నారు. కార్టూనిస్ట్ సరసి వివిధ సామాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వందలాది కార్టూన్లు చిత్రీకరించారని డాక్టర్ సామల రమేష్ బాబు తెలిపారు. సరసికి తాపీ ధర్మారావు పురస్కారం లభించడం పట్ల ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, కార్టూనిస్ట్ వడ్డి ఓంప్రకాష్ నారాయణ హర్షం వ్యక్తం చేశారు.
వివిధ అవార్డులు
* కార్టూన్లకు అంతర్జాతీయ అవార్డులు-4
* జాతీయ అవార్డులు-2
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం
* బాపు రమణ అకాడమీ (ఆత్రేయపురం) నుంచి బాపు అవార్డు
*రోటరీ క్లబ్ ఆఫ్ భాగ్నగర్ వారి వొకేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు
* తిరుపతి సిటీ ఛాంబర్స్ మరియు భారత్ ఆర్ట్స్ అకాడమీలచే ఉగాది పురస్కారాలు
* విజయవాడ ‘స్వరఝరి’ సన్మానం
* తాడేపల్లిగూడంలో బాపు అవార్డు
*మునిమాణిక్ం అవార్డు
*భారత్ ప్రకాశన్ అవార్డు
*సచివాలయ సాంస్కృతిక సంఘం జీవన సాఫల్య పురస్కారం .. ఇవి కాక కథలకు, కార్టూన్లకు పలు బహుమతులు