ఖమ్మం జిల్లాలో తల్దార్ పల్లిలో జరిగిన రాజకీయ హత్య సంచలనాలను కలిగించింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అయితే ఈ కేసులో ప్రధాన ముద్దాయి గా ఉన్న కోటేశ్వరరావు ను మాత్రం ఏ9లో చేర్చారు. ఎఫ్‌ఐఆర్ లో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తిని చివరలో చేర్చడం మునుగోడు ఎన్నికల ప్రభావమేనని చర్చ సాగుతుంది. ఖమ్మం జిల్లా తల్దార్ పల్లిలో టీఆర్ఎస్ నాయకుడిగా ఉన్న తమ్మినేని కృష్ణయ్యను ఈ నెల 15న సీపీఎం క్యాడర్ హత్యకు పాల్పడింది. గ్రామంలో సీపీఎం పార్టీకి కొరకరాని కొయ్యగా తమ్మినేని కృష్ణయ్య ఉన్నాడు. సీపీఎం పార్టీకి కృష్ణయ్య వల్ల ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీంతో తమ్మినేని కృష్ణయ్యను హత్య చేయాలని పథకం పన్నారు. ఆ పథకంలో భాగంగానే సీపీఎం పార్టీకి చెందిన వారే ఒక్క వ్యూహం పన్ని హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండు రిపోర్టు లో పేర్కొన్నారు. కృష్ణయ్య సీపీఎం పార్టీ నుంచి విభేదించి ఆ తరువాత భార్య మంగతాయమ్మను ఎంపీటీసీగా గెలిపించాడు. ఆ తరువాత ఆంధ్ర బ్యాంకు సహకార సంఘ ఎన్నికల్లో కూడా సీపీఎం పార్టీకి కృష్ణయ్య వల్ల ఎదురు దెబ్బ తగిలింది. దీంతో పార్టీ పరంగా నష్టం వస్తుందని భావించారు. దీంతో సీపీఎం క్యాడర్ తో కలసి తమ్మినేని కృష్ణయ్య హత్యకు రచించి హత్య చేశారని కోర్టుకు సమర్పించిన రిమాండు రిపోర్టులో స్పష్టం చేశారు. తమ్మినేని కృష్ణయ్య ను సీపీఎం పార్టీని వదిలివెళ్లి ఆ పార్టీకి నష్టం చేస్తున్నాడని సీపీఎం క్యాడర్ ఆగ్రహంగా ఉంది.
ఇకపోతే హత్య చేసిన తరువాత నిందితులు హత్య జరిగినట్లుగా తమ్మినేని కోటేశ్వరరావు కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. తమ్మినేని కృష్ణయ్యను ఆటోతో ఆయన ప్రయాణం చేస్తున్న మోటార్ బైక్ ను ఆపోజిషన్ డైరెక్టన్ లో ఢీ కొట్టించారు. కృష్ణయ్య క్రింద పడిపోగానే తాము తెచ్చుకున్న ఆయుధాలతో ఇష్టం వచ్చినట్లుగా పొడిచి, నరికి చంపారు. కత్తులు, వేట కొడవళ్లు, యాక్సెస్ బ్లేడ్స్ తో ఇష్టం వచ్చినట్లుగా పొడిచి చంపారు. ఆ తరువాత అదే ఆటోలో అక్కడ నుంచి పరారీ అయ్యారు.
వెంకటగిరి రోడ్డు వద్ద నిందితులను తాము అరెస్టుచేసినట్లుగా పోలీసులు రిమాండు రిపోర్టులో వెల్లడించారు. ఏ2 నుంచి ఏ8 వరకు వెంకటగిరి గేట్ వద్ద సమావేశం అవుతున్నారన్న సమాచారం అందడంతో తాము అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు. నిందితులకు తమ్మినేని కోటేశ్వరరావు మూడు వేల రూపాయలను ఇచ్చి ఆయుధాలను తెప్పించారని చెబుతున్నారు. గత ఆరు నెలల నుంచి ఈ పథకం జరుగుతుందని చెప్పారు. 15 వ తేదీన తమ్మినేని కృష్ణయ్య ఎటు వెళుతున్నది మల్లారపు లక్ష్యయ్య అబ్జర్వ్ చేస్తు అదే ముత్తేశంతో కలసి మోటార్ బైక్ మీద కృష్ణయ్య వెళుతున్నవిషయాన్ని మెంటల్ శ్రీను కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న నిందితులు అందరు కృష్ణయ్య ను హత్య చేసి అదేఆటో లో ఆరెంపుల వద్దకు వెళ్లారు. అక్కడ నిందితులకు 12 వేల రూపాయలను మరో నిందితుడు అందించారు. ముల్కలపల్లి పోలీసు స్టేషన్ వద్ద ఆటోకు పెట్రోల్ పోయించుకుని వెళ్లారు. అక్కడ నుంచి మహబూబాబాద్ కు వెళ్లి అక్కడ కొత్త బట్టలు కొనుక్కున్నారు. అక్కడ ఆయుధాలను, బట్టలనుచెరువులో పడవేశారు.
అక్కడ నుంచి గార్ల బయ్యారంకు వెళ్లి అక్కడ స్కూల్ వద్ద ఆటోను వదిలేశారు. అక్కడ నుంచి కొత్తగూడెం బస్ ఎక్కి బయలు దేరారు. కొత్తగూడెం నుంచి వైజాక్ కు వెళ్లారు. అక్కడ బీచ్ వద్ద ఉన్నారు. అక్కడనుంచి మళ్లీ ఫోన్ ల ద్వారా హత్య చేసిన వారు, హత్యకు సహాయంచేసిన వారితో మాట్లాడారు. ఆ తరువాత మళ్లీ విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి మళ్లీ వైజాగ్ కు వెళ్లారు. మళ్లీ తిరిగి 18 వ తేదీన వైజాగ్ నుంచి ఖమ్మం చేరుకున్నారు. ఇక్కడ వెంకటగిరి గేట్ వద్ద అందరు కలుసుకోగా వారిని పోలీసులు అరెస్టు చేశామని పోలీసులు రిమాండ్ రిపోర్టు లో వెల్లడించారు.