IAS Success Story: UPSC పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పోటీ పరీక్షలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రతి ఏడాది లక్షలాది మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ కలతో ఈ పరీక్షలను దాటడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ విజయం కొద్దిమందినే వరిస్తుంది. అలా విజయం వరించిన ఒకరు తనకు ఒక టీవీ సీరియల్ ఐఏఎస్ కాడానికి ప్రేరణగా నిలిచిందని చెప్పడం జనాలను ఆశ్చర్చానికి గురి చేసింది. ఈ రోజుల్లో చాలా మంది అభిప్రాయాల్లో టీవీ అంటే ఏడుపు గొట్టు అనే ఒక ముద్ర పడిపోయింది. కానీ ఒక టీవీ సీరియల్ చూసి ఒకరు ఏకంగా ఐఏఎస్ అయ్యారు. ఇంతకీ ఈ ఐఏఎస్ ఏ రాష్ట్రానికి చెందిన వారు, ఆ సీరియల్ పేరేంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Hyundai: జీఎస్టీ తగ్గింపుతో, రూ.2.4 లక్షల వరకు తగ్గిన హ్యుందాయ్ కార్‌ల ధరలు..
ఆర్థిక ఇబ్బందులతో జీవితం..
తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళం పట్టణంలో సి.వనమతి జన్మించారు. ఆమె తండ్రి టాక్సీ డ్రైవర్, కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా సాధారణమైంది. చదువుతో పాటు, చిన్నప్పటి నుంచే ఆమె ఇంటి బాధ్యతలను కూడా పంచుకుంది. పాఠశాల తర్వాత, ఆమె కుటుంబానికి చెందిన గేదెలను మేత కోసం తీసుకువెళ్లేది. కొన్నిసార్లు ఇంట్లో చిన్నచిన్న పనులు చేయడం ద్వారా ఇంటి ఆదాయానికి తోడ్పడుతుండేది. 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత, ఆమె వివాహం చేయమని బంధువులు తల్లిదండ్రులను ఒత్తిడి చేశారు. కానీ వనమతి తన చదువును కొనసాగిస్తానని స్పష్టంగా చెప్పింది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు మద్దతు నిలిచి, కంప్యూటర్ అప్లికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయించారు. ఇదే ఆమె జీవిత దిశను మార్చింది.
టీవీ సీరియల్ ప్రేరణ..
తర్వాత ఆమె యూపీఎస్సీ వైపు అడుగులు వేసింది. వనమతి IAS కావడానికి రెండు సంఘటనలు ప్రేరణగా నిలిచాయి. ఒకటి వాళ్ల గ్రామానికి వచ్చిన ఒక మహిళా కలెక్టర్ ఆమెపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రెండోది ‘గంగా యమునా సరస్వతి’ అనే టీవీ సీరియల్ కూడా ఆమె ఆలోచనను మార్చిందని ఆమె చెప్పింది. ఈ సీరియల్‌లో హీరోయిన్ IAS అధికారిణి. ఈ సీరియల్ ఇచ్చిన ప్రేరణతో వనమతి కూడా సివిల్ సర్వీసెస్ మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకుంది.
UPSC కి వెళ్లే మార్గం ఆమెకు అంత సులభం కాలేదు. కానీ ఆమె తన మొదటి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ వరకు చేరుకుంది. కానీ విజయం సాధించలేదు. తరువాతి ప్రయత్నాలలో, కొన్నిసార్లు ప్రిలిమ్స్‌లో, మరికొన్ని సార్లు మెయిన్స్‌లో ఆమె అడ్డంకులను ఎదుర్కొంది. అయినప్పటికీ ఆమె తన ప్రయత్నాన్ని వదులుకోలేదు. ఉద్యోగం చేస్తూనే చదువు కొనసాగించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తూ… UPSC కి సిద్ధమైంది. అపజయాలతో కుంగిపోకుండా స్థిరంగా నిలబడింది. 2015లో ఆమె తన కలను సాకారం చేసుకుంది. UPSC పరీక్షలో 152వ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం ఆమె మహారాష్ట్రలోని ముంబైలో రాష్ట్ర పన్ను శాఖలో జాయింట్ కమిషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్)గా పనిచేస్తున్నారు.