జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై ఈ నెల 17 లోపు నిర్ణయం తీసుకుంటామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం అవుతారని చెప్పారు. బీసీ మూమెంట్ చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం బీసీ జనాభా చాలా తక్కువగా ఉందన్నారు. రీసర్వే చేస్తే కేసీఆర్, కేటీఆర్ కూడా పాల్గొంటారని తలసాని చెప్పుకొచ్చారు. ఈనెల 25న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశం జరిగింది.
బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశం ముగిసిన అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ‘స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై ఈ నెల 17 లోపు నిర్ణయం తీసుకుంటాం. పోటీ చేయాలా, వద్దా అప్పుడు చెబుతాం. త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌తో కార్పొరేటర్లు సమావేశం అవుతారు. రాష్ట్రంలో బీసీ మూమెంట్ చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం బీసీ జనాభా చాలా తక్కువగా ఉంది. ఒరిజినల్ బీసీలు 57 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. కానీ ప్రభుత్వం బీసీ జనాభాను తగ్గించి చూపించింది. జనాభా తక్కువ చూపించడం ద్వారా బడ్జెట్ కేటాయింపులు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. బీసీలకు సీట్లు కూడా తక్కువగా వస్తాయి. రీసర్వే చేస్తే కేసీఆర్, కేటీఆర్ కూడా పాల్గొంటారు’ అని తలసాని తెలిపారు.