Liquor Rates: మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నాలుగేళ్లుగా మద్యం ధరలు పెంచకపోవడంతో కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఆరు నెలల క్రితమే ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది.
తెలంగాణలో మద్యం ధరల పెంపు రాష్ట్ర ప్రభుత్వానికి అనివార్యంగా కనబడుతోంది. గత ప్రభుత్వంలో మద్యం ధరలు పెంచారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మద్యం ధరలు పెంచలేదు. గడిచిన నాలుగేళ్లుగా మద్యం ధరలు పెంచలేదని ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ లిమిటెడ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. మద్యం ధరలు పెంచడంతో పాటు తమకు మద్యం విక్రయాలపై ఇచ్చే మార్జిన్ ను పెంచాలని లేఖలో స్పష్టం చేశారు. అయితే మద్యం ధరలు పెంచాలని కంపెనీల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని గడిచిన ఆరు నెలల క్రితమే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూలై 18న తొలిసారి సమావేశమైంది. జూలై 25లోగా మద్యం కంపెనీలు సరఫరాకు ధరలు కోట్ చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. అదేనెల 26న సీల్డ్ కవర్లు తెరిచి కంపెనీలు కోట్ చేసిన ధరలను చూసింది. 91 కంపెనీలు మద్యం సరఫరాకు ముందుకు వచ్చాయని, బీరు, బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, విదేశీ మద్యం సహా మొత్తం 1032 బ్రాండ్లుకు ధర కోట్ చేశాయని ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో అత్యంత ప్రజాదరణ కలిగిన బీర్ల కంపెనీతో పాటు సోమ్ డిస్టిలరీ, కర్ణాటక, గోవా, మహారాష్ట కంపెనీలు, హైదరాబాద్ లోకల్ కంపెనీలు కూడా ఉన్నాయి.
మద్యం మార్కెట్‌లో దాదాపు 60 శాతం వాటా ఉన్న యూబీ బీర్ల కంపెనీ తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద కనీసం 33 శాతం అదనపు ధర చెల్లించాలని కోట్ చేసింది. ఈ కంపెనీ డిమాండ్‌నే ఇతర కంపెనీలు అనుసరిస్తున్నాయి. ధర పెంచాలని మద్యం కంపెనీలు కోరడం, ప్రభుత్వం తిరస్కరించటం తరచుగా జరుగుతూ ఉంటుంది. 2023లో కూడా మద్యం కంపెనీలు బేసిక్ ధర పెంచాలని కోరగా అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. కానీ ఇప్పుడు మద్యం ధరలు పెంచడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మెగ్గుచూపున్నట్టు సమాచారం. ఇప్పటికే ధరల పెంపునకు సంబంధించి 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఆ దిశగా చర్చలు ఫలించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనరాష్ట్రంలో బీర్ల ధరలు తక్కువగా ఉన్న నేపథ్యంలో కచ్చితంగా ధరలు పెంచాలని ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. మిగతా రాష్ట్రాల్లో ఉన్న ధరల పట్టికను మన దగ్గర ఉన్న ధరల పట్టికలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ముందు ఉంచినట్టుగా తెలిసింది. అయితే తెలంగాణ చుట్టు పక్కల రాష్ట్రాలైన ఆంద్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మద్యం ధరలు పెంచారు. ఆ రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే మద్యం ధరలు తక్కువగా ఉన్నాయని ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. దింతో ఆయా మద్యం కంపెనీల నుంచి ప్రభుత్వం పై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈనేపధ్యంలోనే మద్యం ధరలు పెంచేందుకు ఆబ్కారీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రముఖ కంపెనీల బీర్ల కొరత ఉన్నట్లు వైన్ షాపు యజమానులు చెబుతున్నారు. అయితే కింగ్ ఫిషర్ బీర్ల కొరతను అధిగమించేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. అందులో భాగంగా మిగతా 5 బీర్ల కంపెనీలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే యునైటెడ్ బ్రేవరేస్ లిమిటెడ్ ఉత్పత్తి చేసే కింగ్‌ఫిషర్, కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్, కింగ్‌ఫిషర్ అల్ట్రా, కింగ్‌ఫిషర్ అల్ట్రా మ్యాక్స్‌లు మినహా మిగతా బీర్లను డిపోల్లో అందుబాటులో ఉంచాలని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు బ్రేవరేజెస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు కింగ్ ఫిషర్ బీర్లు రెండు వారాలకు మాత్రమే సరిపడా నిల్వలు ఉండడంతో వాటిని జాగ్రత్తగా మద్యం షాపులకు కేటాయించాలని, ఒక్క షాపుకే అన్ని కాటన్‌లను పంపించకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని షాపులకు వాటిని సరఫరా చేసే విధంగా చర్యలు చేనట్టాలని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సూచించినట్టుగా తెలిసింది. అంతలోపే ఈ సమస్య సద్దుమణిగే అవకాశం ఉండడంతో ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ భావిస్తోంది. కింగ్ ఫిషర్ బీర్లు సరఫరాను నిలిపివేస్తున్నట్లు 10 రోజుల క్రితమే యూబీఎల్ కంపెనీ ప్రకటించింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవటం, ధరలు పెంచాలన్న కంపెనీ నిర్ణయానికి ప్రభుత్వం అంగీకరించకపోవటంతో బీర్ల సరఫరాపై సందిగ్ధం నెలకొంది.