Suryakumar Yadav named ICC Men’s T20I Cricketer of the Year for 2nd time: టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును రెండుసార్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. 2023లో అద్భుతమైన ప్రదర్శనకు గాను ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సూర్యకు ఐసీసీ అందించింది. 2023లో 18 గేమ్‌లలో రెండు సెంచరీలతో సహా 733 పరుగులు చేశాడు. 2022లో కూడా ఈ అవార్డును సూర్యకుమార్ గెలుచుకున్నాడు. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఐసీసీ 2021 నుంచి బహుకరిస్తుంది. 2021లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఈ అవార్డును అందుకున్నాడు.
మెన్స్ టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, ఉగాండా సంచలనం అల్పేష్ రంజానీ, న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్‌లతో పాటు సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీ, గ్లోబల్ మీడియా ప్రతినిధులతో కూడిన ప్యానెల్ మరియు ప్రపంచ క్రికెట్ అభిమానుల ఓటింగ్ తర్వాత సూర్య విజేతగా ఎంపికయ్యాడు. అంతకుముందు 2023 సంవత్సరానికి టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌కు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఐసీసీ ఎంచుకుంది.
Also Read: IND vs ENG: విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్.. అతడు జట్టుకు దూరమవ్వడం పెద్ద లోటు: రోహిత్
దక్షిణాఫ్రికా సిరీస్‌లో గాయపడిన సూర్య టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఆ గాయం నుంచి కోలుకుంటున్న సూర్యకు మరో సమస్య ఉందని తెలిసింది. జనవరి 17న స్పోర్ట్స్ హెర్నియాకు జర్మనీలో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం సూర్య కోలుకుంటున్నాడు. సూర్యకుమార్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం మరో రెండు నెలల సమయం పడుతుందమీ సమాచారం. ఐపీఎల్ 2024 ప్రారంభ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోవచ్చు. అయితే టీ20 ప్రపంచకప్ 2024 సమయానికి అతడు అందుబాటులో ఉంటాడు.