Rohit Sharma Breaks Silence On Virat Kohli’s Replacement in INS vs ENG Test: విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్ అని, అతడు జట్టుకు దూరమవ్వడం పెద్ద లోటే అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గేమ్‌ను విరాట్ మరో లెవల్‌కి తీసుకెళ్లాడని, గత కొన్నేళ్ళుగా భారత జట్టుకు ఆడుతూ ఎన్నో రికార్డులు సాధించాడన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో జరిగే మొదటి రెండు టెస్టులకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. విరాట్ స్థానంలో ఆర్‌సీబీ ఆటగాడు రజత్ పటీదార్‌కు అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంగళవారం బీసీసీఐ నిర్వహించిన అవార్డుల కార్యక్రమానికి పటీదార్ హాజరవడంతో అతడినే ఎంపిక చేశామని బీసీసీఐ చెప్పకనే చెప్పింది.
ఇంగ్లండ్‌తో మొదటి టెస్ట్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్. గేమ్‌ను అతడు మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. గత కొన్నేళ్లుగా విరాట్ టీమిండియాకు ఆడుతున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించాడు. విరాట్ దూరం అవ్వడం జట్టుకు లోటే. జట్టులో స్థానం కోసం యువ ఆటగాళ్లను పరిగణిస్తాం. ఆలా అని సీనియర్లకు కూడా తలుపులు ముసుకు పోలేదు’ అని చెప్పాడు. ‘కోహ్లీ స్థానంలో ముందుగా టీమ్ మేనేజ్‌మెంట్ సీనియర్‌లను తీసుకోవాలనుకుంది. చివరకు యువకులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని జట్టు నిర్ణయించింది’ అని రోహిత్ తెలిపాడు.
‘ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో రాణిస్తాం. అద్భుతమైన ప్రదర్శనతో సిరీస్ కైవసం చేసుకుంటాం. రెండు మాసాలుగా మా ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇంగ్లండ్ జట్టులో బలమైన ప్లేయర్స్ ఉన్నారు. ఎవరినీ తక్కువ అంచనా వేయలేం. పక్కా వ్యూహంతో ఉప్పల్ మైదానంలోకి దిగుతాం. టెస్ట్ సిరీస్‌లో అనేక మార్పులు సంతరించుకున్నాయి. 20 ఏళ్ల క్రితం టెస్ట్ మ్యాచ్‌లకి.. ఇప్పుడు జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లకు చాలా వ్యత్యాసం ఉంది’ అని రోహిత్ పేర్కొన్నాడు. ‘మూడో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లలో ఎవరిని ఆడించాలన్నది తల నొప్పే. పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని ఆడించాలనేది నిర్ణయిస్తాం. మొహమ్మద్ సిరాజ్ గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. మా జట్టులో అతడు ఒక కీలక బౌలర్’ అని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు.