NewsClick Case: దేశ వ్యతిరేక కార్యకలాపాల కేసులో ‘న్యూస్‌క్లిక్’ వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తిల అరెస్టుపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో కేసు పెట్టారు. ఈ అంశంపై గురువారం (అక్టోబర్ 19) విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తి తమ అరెస్టును సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నోటీసు లేకుండా జర్నలిస్టు అరెస్ట్: కపిల్ సిబల్
ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తి ‘దేశ వ్యతిరేక’ ప్రచారాన్ని ప్రోత్సహించడానికి చైనా నుంచి నిధులను సమకూరుస్తున్నారనే ఆరోపణలపై ఉపా చట్టం కింద తమ అరెస్టు, నిర్బంధాన్ని వారు సవాలు చేశారు. 75 ఏళ్ల జర్నలిస్టును నోటీసులు లేకుండా అరెస్ట్ చేశారని, ఇది సరికాదని కోర్టులో ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. హైకోర్టు మాకు ఉపశమనం కలిగించలేదని, ముందస్తు విచారణ కోసం సుప్రీంకోర్టును అభ్యర్థిస్తున్నామని కపిల్ సిబల్ అన్నారు.
Also Read: Marriage Age of Girls: ఆడపిల్లల వివాహ వయస్సు పెంచుతారా?
ఇంతకీ, ప్రబీర్ పుర్కాయస్థను ఢిల్లీ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు?
గ్లోబల్, డొమెస్టిక్ స్థాయిలో కథనాలను సృష్టిస్తూనే, కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లను వివాదాస్పద ప్రాంతాలుగా అభివర్ణిస్తున్నారని న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడిని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆరోపించింది. అంతేకాకుండా, భారతదేశం మ్యాప్‌ను తారుమారు చేయడం ద్వారా ఐక్యత, ప్రాదేశిక సమగ్రతపై దాడి చేశారని కూడా ఆరోపించారు. న్యూస్‌క్లిక్ న్యూస్ వెబ్‌సైట్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ, ఆయన సహచరులు జోసెఫ్ రాజ్, అనూప్ చక్రవర్తి (అమిత్ చక్రవర్తి సోదరుడు), బప్పాదిత్య సిన్హా (వర్ట్యూనెట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్) అక్రమ మార్గాల్లో డబ్బును సేకరించేవారని కూడా పోలీసులు తెలిపారు. ఈ డబ్బును తీస్తా సెతల్వాద్ సహచరులు గౌతమ్ నవ్‌లాఖా, జావేద్ ఆనంద్, తమరా, జిబ్రాన్, ఊర్మిళేష్, ఆరాత్రిక హల్దర్, పరంజయ్ గుహా ఠాకుర్తా, త్రినా శంకర్ మరియు జర్నలిస్టు అభిసర్ శర్మకు పంచారని కూడా ఆరోపణలు వచ్చాయి.