వక్ఫ్ (సవరణ) చట్టం 2025 యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్నలు సంధించింది. ముస్లింలను హిందూ మత ట్రస్టులలో చేరడానికి అనుమతిస్తారా ? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. అనేక వక్ఫ్ ఆస్తులకు రిజిస్ట్రీ వంటి పత్రాలు లేనప్పుడు.. ‘వక్ఫ్ బై యూజర్’ చెల్లదని ఏ ప్రాతిపదికన ప్రకటిస్తారు? అని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
READ MORE: Khushi Kapoor : ప్రియుడి పేరుతో చైన్.. ఖుషి కపూర్ డేటింగ్..?
‘వక్ఫ్ బై యూజర్’ వ్యవస్థను రద్దు చేయడం అనేది ఇప్పటికే ఉన్న వ్యవస్థను తిరగదోడడమే అవుతుందని, ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని మూడు ముఖ్యమైన ప్రశ్నలు అడిగింది. ఈ మూడు అంశాలపై వాదించడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమయం కోరారు. ప్రస్తుతానికి ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం లేదని, అయితే గురువారం కూడా కేసు విచారణ కొనసాగుతుందని కోర్టు తెలిపింది. గురువారం విచారణ ముగిసిన తర్వాత, సుప్రీంకోర్టు ఈ అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవచ్చు.
ఆ ప్రశ్నలు ఇవే..
1. వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయవచ్చా?
2. కలెక్టర్ దర్యాప్తు సమయంలో వక్ఫ్ గుర్తింపుపై స్టే విధించడం సముచితమేనా?
3. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చుకోవచ్చా?