Summer Vacation Extended: ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాఠశాలలకు మే 31 వరకు ఇచ్చిన వేసవి సెలవులను పొడిగించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగించారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగించినట్టు పుదుచ్చేరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం ప్రకటించారు. మంత్రి మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ… పుదుచ్చేరి రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టలేదని, అందువల్ల విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జూన్ 1వ తేదీకి బదులుగా 7వ తేదీన పాఠశాలల్ని పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబ్సకు విధించిన నిబంధనల్ని సడలించి, అనుమతి ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని కోరామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు వస్తాయని తెలిపారు.
Read Also: Astrology : మే 31, బుధవారం దినఫలాలు
ప్రస్తుతం పుదుచ్చేరిలో వున్న 127 ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సీబీఎస్ఈ పాఠ్యాంశాన్ని అమలు పరిచేందుకు అనుమతులు లభించాయని.. అందువల్ల సీబీఎస్ఈ పాఠ్య పుస్తకాల కొనుగోలు పనులు ప్రారంభిచామని మంత్రి తెలిపారు. తొలి విడతగా కారైక్కాల్, మాహే, యానాం ప్రాంతాలకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తున్నామన్నారు. పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలను అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఉచిత యూనిఫారం, సైకిళ్ల పంపిణీ జరిగిందని చెప్పిన మంత్రి.. ఒకటిన్నర నెలలో ల్యాప్టాప్లను కూడా అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన పథకాలన్నింటినీ ప్రభుత్వం దశల వారీగా నేరవేరుస్తుందన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.