Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Story Board: తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా సరే.. కాంగ్రెస్‌ను ఇక్కడి ప్రజలు పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంచారు. దీంతో స్వీయలోపాలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ నేతలు.. గ్రూపుతగాదాలు పక్కనపెట్టి.. తామంతా ఒక్కటేననే సంకేతం బలంగా జనంలోకి పంపి.. ఎట్టకేలకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత కూడా గతానికి భిన్నంగా ఎక్కడా పెద్దగా పొరపొచ్చాలు లేకుండా జాగ్రత్తపడ్డారు. కానీ సర్కారు కీలక మజిలీకి చేరుకున్న తరుణంలో.. ఒకరిద్దరు లైన్ దాటి మాట్లాడటం.. పార్టీలో చర్చకు దారితీసింది. అవి కూడా మామూలు విమర్శలు కాకుండా.. ఏకంగా ప్రతిపక్షాల్ని కూడా మించిపోయి మాట్లాడటం.. సొంత పార్డీ క్యాడర్‌కూ తప్పుడు సంకేతాలు పంపింది. మొదటిగా సీఎం జిల్లా పర్యటనకు దూరంగా ఉన్న కొండా సురేఖ.. ఆ తర్వాత తన కుమార్తె ముఖ్యమంత్రిని కౌంటర్ చేస్తూ మాట్లాడుతున్నా ఉపేక్షించారు. పైగా వివరణ అడిగితే.. తన కూతురు వ్యాఖ్యలతో తనకేం సంబంధమని సమాధానమిచ్చారు. అంతటితో ఆగకుండా తనపై పార్టీలో కొందరు కుట్ర చేస్తున్నారని, వారెవరో తేల్చాలని చేసిన వ్యాఖ్యలు.. మరింత దుమారానికి తావిచ్చాయి. దీనికి కొనసాగింపుగా కొండా మురళి ప్లాన్ ఏ, బీ అంటూ చేసిన వ్యాఖ్యలు లేనిపోని అనుమానాలకు కారణమయ్యాయి. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు సరైన స్పందన లేకపోవడంతో.. కొండా సురేఖపై వేటు వేయాలని నివేదిక ఇచ్చింది. ఈ నివేదికనే పీసీసీ ఏఐసీసీకి పంపింది.
ఇక రాష్ట్ర ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్ చిన్నారెడ్డిది మరో తీరు. ఆయన క్యాబినెట్ హోదా ఉన్న పదవిలో ఉండి కూడా.. పార్టీని తప్పుబడుతున్నట్టుగా మాట్లాడారనే ఫిర్యాదులొచ్చాయి. క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌కు చిన్నారెడ్డి ఇచ్చిన వివరణ సరిగా లేదనే అభిప్రాయం వినిపించింది. పైగా తాను సీఎంను, పార్టీని తప్పుబట్టలేదని చిన్నారెడ్డి చెప్పినా.. పార్టీలో అసలైన కాంగ్రెస్ నేతలకు న్యాయం జరగడం లేదనటాన్ని చిన్న విషయంగా కొట్టిపారేయలేమనే వాదన వినిపించింది. పైగా బాధ్యతగల పదవిలో ఉండి కూడా.. పార్టీని బద్నాం చేసేలా మాట్లాడటం ఏమిటనే ప్రశ్నలొచ్చాయి. దీంతో ఆయనపైనా వేటు వేయాలనే నివేదిక ఏఐసీసీకి చేరిందని చెబుతున్నారు. ఇక్కడ నేతలు ఎంత లైన్ దాటి మాట్లాడినా.. వారి వైపు వాదన వినకుండా.. ఎక్కడా నివేదిక తయారుకాలేదు. వీరిపై వచ్చిన ఆరోపణలతో పాటు.. వారి వివరణ కూడా తీసుకున్నాకే నివేదికకు తుది రూపు ఇచ్చారు. పనిలోపనిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఫిర్యాదులొచ్చినా.. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ చేసేలా లేవనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతకుముందే రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ ఇచ్చి.. ఆయన వివరణను నమోదు చేసుకుంది. మొత్తంగా ఎక్కడా ఏకపక్షంగా చర్యలు తీసుకుంటున్నారనే అభిప్రాయం కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. అదే సమయంలో పార్టీలో మళ్లీ పాత కల్చర్ బలపడుతోందని కార్యకర్తలు అనుకోకుండా.. వెంటనే రియాక్ట్ అయ్యారు.
Also Read
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. ఇకపై గేరు మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. మరింత వేగంగా, దూకుడుగా ముందుకెళ్లాల్సిన తరుణంలో.. పార్టీలో అపస్వరాలు ఉండకూడదని రాష్ట్ర పార్టీ అగ్రనేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షాలపై పోరాడాల్సిన సమయంలో.. సొంతవారిపైనే కత్తులు దూయటం ఏ రకంగానూ సమర్థనీయం కాదనే చర్చ గట్టిగా జరుగుతోంది. ఇప్పటికే గాంధీభవన్ దగ్గర్నుంచి.. గ్రామాల వరకూ ఈ ఎపిసోడ్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా.. అనేది హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ఎపిసోడ్ సమయంలో సీఎం రేవంత్ విదేశాల్లో ఉండటం.. మరోవైపు కేసీ వేణుగోపాల్ కూడా విదేశీ టూర్లో ఉండటంతో.. నిర్ణయానికి కొద్దిరోజులు ఆలస్యమైంది. ఇప్పుడు అగ్రనేతలంతా అందుబాటులో ఉండటం.. సీఎం ఢిల్లీ వెళ్లడంతో.. ఈ సమస్య ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ప్రస్తుతం జరిగిన పరిణామాల ఆధారంగా నివేదిక ఇచ్చినా.. ఏఐసీసీ స్థాయిలో నివేదికను మరింతగా వడపోసి.. సదరు నేతల పాత రికార్డులన్నీ వెలికితీసి మరీ తుది నిర్ణయం తీసుకోవచ్చని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. పనిలోపనిగా సీఎంతో పాటు రాష్ట్ర పార్టీ అగ్రనేతల్ని కూడా హస్తినకు పిలవడం అందులో భాగమేనని చెబుతున్నారు. ఏ నిర్ణయమైనా.. అది సమష్టిగానే తీసుకోవాలనే ఉద్దేశంతో హైకమాండ్ కనిపిస్తోంది. ఏ ఒక్కరి అభిప్రాయానికో విలువ ఇచ్చినట్టు కాకుండా.. ఓవరాల్‌గా పార్టీకి మేలు అనే యాంగిల్లోనే ఆలోచించాలనే సూచనలు వస్తున్నాయి.
ఏదేమైనా ఇప్పటిదాకా సీఎం రేవంత్ చాలాసార్లు హస్తినవెళ్లి.. అగ్రనేతలతో భేటీ అయినా.. ఈసారి టూర్ మాత్రం టీకాంగ్రెస్‌కు దిశానిర్దేశం చేయడంలో కీలకమని నేతలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర కాంగ్రెస్ కోర్ గ్రూప్ మొత్తానికి హైకమాండ్ నుంచి పిలుపురావడం.. ఆ భావనను మరింత బలపరుస్తోంది. సరిగ్గా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు కూడా.. కాంగ్రెస్ హైకమాండ్ ఇలాగే కీలక భేటీలు జరిపిన తర్వాతే.. వ్యూహరచన చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా క్యాబినెట్ కూర్పు నుంచి.. ప్రతి కీలక నిర్ణయం తీసుకునే ముందు సంప్రదింపులకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈసారి తీసుకునే నిర్ణయం.. మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్‌కు మెసేజ్ ఇచ్చే అవకాశం ఉండటంతో.. మరింత జాగ్రత్తగా కసరత్తుకు ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎవరేమనుకున్నా.. తెలంగాణలో పార్టీని, సర్కారును బలహీనపరిచే ప్రయత్నం చేసినా.. సహించే పరిస్థితిలో హైకమాండ్ లేదనడం నిర్వివాదాంశం. ఎంతో కష్టపడితే దక్కిన అధికారాన్ని.. కొందరు నేతల స్వార్థం కోసం బలిపెట్టడానికి రెడీగా లేమనే సంకేతాలు వస్తాయని రాష్ట్ర పార్టీ ఎదురుచూస్తోంది. పార్టీ బాగుంటేనే నేతలు బాగుంటారన్న విషయాన్ని అంతా అర్థం చేసుకోవాలని ఇప్పటికే అధిష్ఠానం చాలాసార్లు చెప్పింది. ఏమున్నా అంతర్గత వేదికలపైనే మాట్లాడాలి కానీ.. రచ్చచేయొద్దని ముందే స్పష్టంగా చెప్పింది. అయినా సరే.. ఒకరిద్దరు నేతలు ఇలా ధిక్కార వైఖరితో మాట్లాడటం.. పైగా చాలా సీనియార్టీ ఉండి కూడా.. పరిణతి లేకుండా వ్యవహరించటాన్ని ఎలా చూస్తారనేది తేలాల్సి ఉంది.
తెలంగాణ కాంగ్రెస్ లో మొదట్నుంచీ అనుభవానికి లోటు లేదు. కాకాపోతే ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే అధికారం ఆలస్యమైందనే చర్చ సొంత పార్టీ క్యాడర్లోనే జరిగింది. కాకపోతే ఎన్నికలకు కొన్నాళ్ల ముందు.. పార్టీ నేతలంతా ఒకే గొంతుక వినిపించడమే కాకుండా.. ఇక పాత కల్చర్‌కు కాలం చెల్లిందని ప్రజలకు మాటివ్వడం కలిసొచ్చిందనుకున్నారు. అలాగే అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల పాటు చిన్న చిన్న ఇష్యూలు తప్ప.. దాదాపుగా నేతలంతా అదే మాట మీద నిలబడ్డారు. గతంలో మాదిరిగానే కాంగ్రెస్‌లో చిచ్చు రేగుతుందని ఆశించిన ప్రతిపక్షాలకు కూడా నిరాశ ఎదురైందని చెప్పక తప్పదు. కానీ రెండున్నరేళ్లు పూర్తైన సందర్భంగా.. అవాంఛనీయ ధోరణులు బయటపడటమే ఇప్పుడు పార్టీకి తలబొప్పి కట్టిస్తోంది. అప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి.. ఎక్కడా కొందరికి ప్రాధాన్యమిస్తున్నారనే చర్చ రాకుండా జాగ్రత్తపడుతున్నారు. అందర్నీ కలుపుకుపోవటానికే చూస్తున్నారు. ఆ భావనతోనే.. కొందరు నేతలు అడపాదడపా అసంతృప్తి వ్యక్తం చేసినా.. లైట్ తీస్కుంటూ వస్తున్నారు. ఎవరైనా ఈ విషయం ఆయన దగ్గర ప్రస్తావించినా.. కుటుంబం అన్నాక భేదాభిప్రాయాలు సహజమేనని చెబుతూ వచ్చారు. ఆయనతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కలిసి ఉంటేనే పార్టీకి బలమనే విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస ఎన్నికల్లో గెలుపు కూడా ఆషామాషీగా రాలేదు. దాని వెనుక రాష్ట్ర పార్టీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా చేసిన కసరత్తు ఉంది. ఎక్కడా పార్టీ నేతల్లో అసంతృప్తి చెలరేగకుండా.. ఎక్కడికక్కడ అందర్నీ సర్దుబాటు చేసుకుంటూ.. పార్టీని ఒక్కటిగా ముందుకు నడిపి.. ప్రతిపక్షాలు ఊహించని విజయాలు సొంతం చేసుకున్నారు. తద్వారా కాంగ్రెస్ ఏకాభిప్రాయంతో ఉంటే.. అజేయంగా ఉంటుందనే నమ్మకాన్ని కార్యకర్తల్లోనూ కలిగించగలిగారు. అందుకు తగ్గట్టే కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ క్యాడర్‌లోనూ విశ్వాసం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో కొందరు నేతల దుందుడుకు వైఖరి పార్టీతో పాటు సీఎంకు కూడా జీర్ణం కావడం లేదు.
ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే.. సమాధానం చెప్పొచ్చు. విమర్శలు చేస్తే తిప్పికొట్టొచ్చు. కానీ ప్రభుత్వంలో, పార్టీలో పాలు పంచుకుంటున్న వారే నోటికొచ్చినట్టు మాట్లాడితే.. దానికి కౌంటర్‌గా ఏం చేయాలా అనే ఆలోచనే దారుణంగా ఉంది. ఇదే అదనుగా ప్రతిపక్షాలు మొదట మీ నేతలకు సమాధానం చెప్పండంటూ.. సెటైర్లు వేయడం.. ఇప్పటిదాకా విపక్షంపై పైచేయి సాధించామనే ప్రచారానికి అడ్డుకట్ట వేసేలా ఉండటం.. ఎవరికీ నచ్చడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా అటు పాలనపైనా.. ఇటు పార్టీపైనా దృష్టి పెడుతూ వచ్చారు. కానీ ఇకపై అలా కుదరకపోవచ్చు. కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్న దశలో.. పాలనపైనే ఫోకస్ పెట్టాల్సి రావచ్చు. అందుకే మొదట పార్టీని చక్కదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఇదే తరుణంలో.. అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో కావాల్సిన మార్పులు కూడా చేసేస్తే.. ఇక అలా కొత్తగా ఏర్పాటయ్యే టీములతోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనేది రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతల అభిప్రాయంగా ఉంది. ఇప్పటికే అందుకు అనుగుణంగా సంప్రదింపులు కూడా పూర్తవడంతో.. ఇక హైకమాండ్ ఆమోదమే తరువాయి అనే చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
-
Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రాహుల్‌నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్‌కు అదే నివాళి
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!