Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికన్ డ్రీమ్ ఇక కలగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. ఓవైపు యుద్ధాలతో ప్రపంచానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్న ట్రంప్.. మరోవైపు వీసాలపై రోజుకో రూల్‌తో గందరగోళం సృష్టిస్తున్నారు. ఇప్పటికే హెచ్‌వన్‌బీ వీసా ఫీజును భారీగా పెంచేసిన ట్రంప్ అంతటితో ఆగకుండా.. విద్యార్థి వీసాలకూ కఠిన నిబంధనలు పెట్టారు. పైగా టూరిస్టు, బిజినెస్ వీసాలు కావాలన్నా అంత వీజీ కాదనేలా కొత్త షరతులు పెడుతున్నారు. అంతేకాదు ఉద్యోగం ఊడిపోయిన తక్షణమే అమెరికా వీడాలనే రూల్‌తో విదేశీ ఉద్యోగుల నెత్తిన బాంబు పడ్డట్టైంది. అమెరికా కేవలం అమెరికన్లకే అనే కొత్త సిద్ధాంతాన్ని ట్రంప్ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ప్రపంచ దేశాలు అప్పనంగా అమెరికా సంపద దోచుకున్నాయంటున్న ట్రంప్.. ఇకపై అలా కుదరదని తేల్చేస్తున్నారు. ఆ పాలసీకి అనుగుణంగానే అసలు విదేశీయులకు వీసాలే పుట్టకూడదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
Also Read
అమెరికాకు వెళ్లాలి..అక్కడే విద్యనభ్యసించాలి. అక్కడే సెట్ అయిపోవాలి. జీవితాన్ని హాయిగా గడపాలి. ఇది ఎంతో మంది విదేశీ విద్యార్థుల కల. అందుకు అనేక సవాళ్లు సైతం ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడతారు. కానీ, అమెరికా ప్రయాణానికి ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్కలా మారిపోయింది పరిస్థితి. కారణం.. అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు. అంతకు మించి ఆయన తెంపరితనం. వలసదారులంటేనే ఆగ్రహం వ్యక్తం చేసే ట్రంప్.. ఇప్పుడు అమెరికాలో అడుగు పెట్టాలంటేనే వణుకుపుట్టేలా వ్యవహరిస్తున్నారు.
అమెరికా వెళ్లే విదేశీయులు, ఉద్యోగులు, విద్యార్థులకు…అగ్రరాజ్యం ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. మరోసారి ఆ దేశానికి వెళ్లాలంటే వణికిపోయేలా చేస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తలతిక్క నిర్ణయాలు తీసుకుంటూ…విదేశీయులను భయపెడుతున్నారు. అమెరికాలో అడుగుపెట్టకుండా బెదరగొడుతున్నారు. శత్రు దేశం…మిత్ర దేశం అన్న తేడా లేదు. అంతా మా ఇష్టం అన్నట్లు డోనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును భారీగా పెంచేసిన ట్రంప్…ఆ తర్వాత సోషల్ వెట్టింగ్‌తో విద్యార్థులు, ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా హెచ్1బీ వీసాల పునరుద్ధరణ వీసాల అపాయింట్మెంట్లను రద్దు చేసి…ఝలక్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలస విధానాలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే షెడ్యూల్ అయిన కొన్ని వీసా ఇంటర్వ్యూలను కూడా రద్దు చేసింది. కొత్త ఇంటర్వ్యూ తేదీలను తర్వాత ప్రకటిస్తామని దరఖాస్తుదారులకు తెలియజేసింది. అయితే ఈ చర్యతో అసలు వీసా వస్తుందా.. లేదా అనేది తర్వాత.. మొదట అపాయింట్మెంట్ అయినా దక్కుతుందా లేదా అనే సందేహాన్ని పుట్టించడంలో ట్రంప్ సక్సెస్ అయ్యారు.
అయితే ఈ నిర్ణయం వెనుక వీసా నిబంధనల్లో తక్షణ మార్పులు కాకుండా.. అమెరికా కాన్సులర్ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడమే ప్రధాన కారణమని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో ఈ శిక్షణ జరుగుతోందని, అందుకు అనుగుణంగా వీసా అపాయింట్మెంట్లను సర్దుబాటు చేస్తున్నట్లు పేర్కొంది. పనిలోపనిగా ట్రంప్ సర్కారు వీసా పరిశీలన ప్రక్రియను మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపడుతోంది. దరఖాస్తుదారుల వ్యక్తిగత నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, అమెరికాలో ప్రభుత్వ సహాయంపై ఆధారపడే అవకాశాలు వంటి అంశాలను లోతుగా పరిశీలించేలా అధికారులకు శిక్షణ ఇస్తోంది. ఈ పరిణామంతో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావిస్తున్న విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లాలనుకునే నిపుణుల్లో ఆందోళన నెలకొంది. వీసా అపాయింట్మెంట్ సేవలు తిరిగి సాధారణ స్థితికి ఎప్పుడు వస్తాయనే విషయంపై అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన గడువును ప్రకటించలేదు.
ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను పంపించేయడానికి వలస విధానాలను కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా వీసాలు, గ్రీన్ కార్డ్‌లను రద్దు చేయడం, వివిధ కారణాలతో దరఖాస్తులను తిరస్కరించడం వంటివి ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ అభిప్రాయాలు, గాజాపై అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా జరిగే నిరసనలు వంటి కారణాలను పేర్కొంటున్నారు. ఈ కఠిన చర్య జాతీయ భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఉందని ట్రంప్ చెబుతున్నారు. అయితే, ఇది చట్టపరమైన అడ్డంకులను కూడా ఎదుర్కొంది. ఇప్పటికే 75 దేశాల దరఖాస్తుదారులకు వలస వీసాల జారీని నిషేధించిన ట్రంప్ విధానాన్ని కోర్టు కొట్టివేసింది. ఈ విధానం విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చట్టపరమైన అధికార పరిధిని అతిక్రమించిందని న్యాయమూర్తి తీర్పులో చెప్పారు. కానీ తన దగ్గర ప్లాన్ బీ ఉందని మొదట్నుంచీ చెబుతున్న ట్రంప్.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలోనో, మరో రూపంలోనే కొత్త కొత్త కఠిన నిబంధనలు తెస్తూ.. వీసా దరఖాస్తుదారుల్ని బెదరగొడుతున్నారు.
అమెరికా ప్రభుత్వ సౌకర్యాలపై ఆధారపడే అవకాశం ఉన్న దరఖాస్తుదారులను గుర్తించడంలో కాన్సులర్ అధికారులకు సహాయపడటానికి, వీసా దరఖాస్తుదారులను క్రమ పద్ధతిలో రివ్యూ చేసేలా నిర్ధారించడానికి ప్రస్తుతం అధికారులకే ఇచ్చే శిక్షణ ఉద్దేశించింది ట్రంప్ సర్కారు. అంటే ఈ శిక్షణ తర్వాత వీసా అప్లికేషన్ల స్క్రుటినీ మరింత కఠినం కానుంది. తద్వారా వీసా తిరస్కరణలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఓవైపు ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో చిచ్చు పెట్టిన ట్రంప్.. మరోవైపు వీసా సమస్యను పెంచి పెద్దది చేసి.. ఎవరూ అమెరికా వైపు చూడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ట్రంప్ చర్యలతో ఇప్పటికే అమెరికా వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య 15 శాతం తగ్గిపోయింది. అయినా తగ్గని ట్రంప్.. ఒక్క విదేశీయుడూ అమెరికాలో అడుగుపెట్టడానికి వీల్లేని విధంగా వీసా మార్గాలన్నీ ఒక్కొక్కటిగా మూసేయటమే లక్ష్యంగా పనిచేస్తారు. ఎవరైనా ఈ చర్యల్ని ప్రశ్నిస్తే.. వారిపై దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. ఎవరేమనుకున్నా.. వీసాల విషయంలో కఠిన వైఖరి కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో చివరకు కోర్టు తీర్పుల్ని కూడా సీరియస్‌గా తీసుకునే ఉద్దేశం తనకు లేదన్నట్టుగా ట్రంప్ చెప్పకనే చెబుతున్నారు. చివరకు ట్రంప్ దెబ్బకు అమెరికా వర్సిటీల స్వతంత్రత కూడా ప్రమాదంలో పడి.. అవి కూడా తమ విద్యార్థుల్ని అదరగొడుతున్నాయి.
అమెరికాలో వలసదారుల కారణంగా ఆ దేశ పౌరులకు అవకాశాలు తగ్గిపోతున్నాయనే వాదనను బలంగా వినిపించి ట్రంప్ అధికారంలోకి వచ్చారు. అధ్యక్షుడైతే వలసల నియంత్రణపై దృష్టి పెడతానని మొదటే చెప్పారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం పేరుతో ప్రక్రియ మొదలుపెట్టినా.. చివరకు వీసాలు దొరకటం కూడా గగనంగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వృత్తినిపుణులు అందునా భారతీయుల ఎక్కువ సంఖ్యలో వలస రావటానికి హెచ్‌వన్‌బీ వీసానే రాజమార్గంగా ఉందని ట్రంప్ గుర్తించారు. దీంతో ఆ వీసా ప్రక్రియను బాగా కఠినతరం చేశారు. జాతీయ భద్రత అనే సాకు చెప్పి.. తలా తోకా లేని రూల్స్‌తో వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ట్రంప్ దెబ్బతో తొలిసారి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారితో పాటు రెన్యువల్ కోసం చూస్తున్నవారికీ కష్టాలు తప్పటం లేదు. గతంలో ఉద్యోగం వస్తే.. వీసా గ్యారంటీగా వచ్చేది. కానీ ఇప్పుడు ఉద్యోగాలు రావడం కంటే.. వీసా రావడమే పెద్ద సమస్యగా మారింది. అలాంటి పరిస్థితిని ట్రంప్ ఉద్దేశపూర్వకంగా సృష్టించారు.
- Tags
- h1b visa
- ntv
- story board
తాజావార్తలు
-
OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
-
Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
-
Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!