Violence Unlimited : సినిమా రంగానికి బాధ్యత లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రియేటివిటీ పేరుతో సినిమాలో వైలెన్స్ చూపిస్తున్నారా? దర్శకులకు స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ పై పట్టు ఉండటం లేదా? నిజ జీవితంలో ఎన్నడూ చూడని హింసను ఆడియన్స్ కు పరిచయం చేస్తున్నారా? సినిమాల్లో చూపిస్తున్నంత వైలెన్స్ ఎక్కడైనా జరుగుతుందా? మూవీస్ లో హింసాత్మక సీన్లతో దర్శకులు ఓవరాక్షన్ చేస్తున్నారా? వైలెన్స్ లేకపోతే మూవీస్ ను ప్రేక్షకులు ఆదరించడం లేదా?
టాలీవుడ్, బాలీవుడ్, శాండల్‌వుడ్, కోలీవుడ్.. ఏ ఇండస్ట్రీ అయినా సినిమాల్లో స్క్రీన్ ప్లే పూర్తిగా మారిపోయింది. లవ్, రొమాన్స్, సస్పెన్స్, థ్రిల్లర్ స్టోరీస్ కి కాలం చెల్లింది. ఇప్పుడంతా యాక్షన్ మూవీసే, అలాంటి ఇలాంటి యాక్షన్ కాదు, అంతా వైలెన్స్. నిజ జీవితంలో ఆడియన్స్ చూడని, ఫేస్ చేయని హింస, రక్తపాతం. వాళ్ళు, వీళ్ళు అని తేడా ఏం లేదు, అందరూ ఆ తాను ముక్కలే. నిన్న మొన్నటి వరకు హీరోలు, విలన్ల మధ్య ఫైట్ జరిగేది. హీరో 10 లేదంటే 20 మంది విలన్లు లేదంటే రౌడీలను చితకబాదేవాడు. హీరో దెబ్బకి విలన్లు పారిపోయేవాళ్ళు. అదంతా గతం! మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమాల్లోనూ వైలెన్స్ పెరిగిపోతోంది. నువ్వా నేనా అన్నట్లు హింసాత్మక సీన్స్ తీసేందుకు దర్శకులు పోటీ పడుతున్నారు. తమ సినిమాల్లో హింసకి ప్రాధాన్యతను ఇస్తున్నారు. వైలెన్స్ కే వణుకు పుట్టేలా స్క్రీన్ ప్లేను అదరగొడుతున్నారు. హింస అంటే మరి ఇంతలా ఉంటుందా? మనుషుల్ని ఘోరంగా టార్చర్ చేస్తారా? ఇలా కూడా వైలెన్స్ ని చూపించవచ్చా? అనే రీతిలో దర్శకులు రెచ్చిపోతున్నారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కూడా విరక్తి కలిగేలా సీన్స్ తీస్తున్నారు. ఇటీవల కాలంలో విడుదలైన ఏ సినిమాను తీసుకున్నా ఓ రేంజ్ లో వైలెన్స్ ని ప్రెసెంట్ చేశారు. నిత్య జీవితంలో అంత వైలెన్స్ ఉండదు. మరి సినిమాల్లో మాత్రమే ఎందుకు భరించలేనంత, ఊహించలేనంత హింస చూపించడం ఏంటి?
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
- Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
- Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
క్రియేటివిటీ లేకపోవడంతో వైలెన్స్ కి పెద్ద పీట వేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. క్రియేటివిటీ అంటూ డబ్బాలు కొట్టుకుంటున్న దర్శకులు.. క్రియేటివిటీ అంటే మితిమీరిన హింసాత్మక సీన్స్ తెరకెక్కించడమేనా? స్క్రిప్ట్ మీద పట్టు లేని వారందరికీ వైలెన్స్ సబ్జెక్ట్ గా మారిపోయింది. 20 ఏళ్ల క్రితమే దర్శకుడు రాంగోపాల్ వర్మ అంతం, సత్య, సర్కార్ లాంటి సినిమాలు తీస్తే నెత్తి నోరు బాదుకున్నారు. ఇప్పటి దర్శకులకు మాత్రం హింసే పెద్ద సబ్జెక్ట్ గా మారిపోయింది. ప్రెజెంట్ డైరెక్టర్స్ తమలోని ఫ్రస్ట్రేషన్ ని జనం మీద తీర్చుకుంటున్నారు. క్రియేటివిటీ అంటే మోర్ వైలెన్స్ అంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. జీవితాల్లో లేని హింస, రక్తపాతం సినిమాల్లో ఎందుకన్నది మాత్రం ఒక్కరూ ఆలోచించడం లేదు. సమాజంలో జరుగుతున్న సంఘటనలకి, తెర మీద దర్శకులు చూపిస్తున్న వైలెన్స్ కి అసలు సంబంధమే ఉండటం లేదు. రక్తపాతం, హింస చుట్టూ కథలు అల్లుకొని తాము తీసిందే సూపర్ అని దర్శకులు ఫీల్ అయిపోతున్నారు.
తెర మీద రక్తపాతం క్రియేట్ చేస్తే కలెక్షన్ల వర్షం కురుస్తుందా? ఘోరమైన హింసను చూసేందుకు జనం థియేటర్స్ కి వస్తారా? హీరోలు విలన్ల తలలు నరకడం, లేదంటే సుత్తితో బాదడం, పాయింట్ బ్లాంక్ లో ప్రైవేట్ పార్ట్స్ లో కాల్చడం వంటి సీన్స్ నే డైరెక్టర్స్ గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు. అసలు హింస లేకుండా సినిమా తీసే సత్తా లేదా? వైలెన్స్, రక్తపాతం లేని సినిమాలను ఆడియన్స్ ఆదరించరనే భయం పట్టుకుందా? డైరెక్టర్స్ ఎందుకు టాక్సిక్ గా ఆలోచిస్తున్నారు అన్నదే ఆడియన్స్ కి అర్థం కావడం లేదు. సినిమాల్లో టూ మచ్ వైలెన్స్ చూపించడం ఎందుకు? దానికి పిల్లలు సినిమాని చూడొద్దని కండిషన్స్ పెట్టడం ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే హాలీవుడ్ సినిమాల్లో కూడా టాలీవుడ్, బాలీవుడ్ లో ఉన్నంత హింస, రక్తపాతం, ఒళ్లు గగురు పొడిచే సీన్స్ ఉండవు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే శృతి మించిన రక్తపాతం, హింస కనిపిస్తున్నాయి. ఒక్క డైరెక్టర్ కూడా లాజిక్ గా ఆలోచించడం లేదు. మన దర్శకులు కలెక్షన్ల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు హింస, రక్తపాతంతోనే డబ్బు సంపాదించాలని దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు.
సినిమాల్లో విపరీతమైన వైలెన్స్ చూపిస్తుంటే సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది? అనేక కారణాలతో సినిమాలకు రెడ్ ఫ్లాగ్ చూపించే సెన్సార్ బోర్డు.. హింస, రక్తపాతం పై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది? ఇష్టమున్న సినిమాలకు క్లీన్ చిట్ సర్టిఫికెట్ ఇవ్వడం, నచ్చని వాటిని అడ్డుకోవడమే సెన్సార్ బోర్డ్ లక్ష్యమా? వైలెన్స్, బ్లడెడ్ మూవీస్ ను ఎందుకు అడ్డుకోవడం లేదు? ఇండియాలో ప్రతి ఏడాది వివిధ భాషల్లో వందల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులోనూ సౌత్ ఇండియాలో మెజారిటీ సినిమాలు తెరకెక్కుతున్నాయి. పాన్ ఇండియా పేరుతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. ఇటీవల భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాలు అన్నింటిలోనూ స్టోరీ, స్క్రీన్ ప్లే కంటే హింస, రక్తపాతమే డామినేట్ చేశాయి. ఆ సీన్స్ చూస్తున్న ఆడియన్స్ కే ఒళ్లు గగురు పొడుస్తోంది. ఎంత భయంకరంగా చూపిస్తే ఆడియన్స్ అంతలా కనెక్ట్ అవుతారనే ట్రాన్స్ లో డైరెక్టర్స్ ఉన్నారు.
అనిమల్, దురందర్ వన్, దురందర్ 2, కేజిఎఫ్, కేజిఎఫ్ 2, డిసి, విక్రమ్, హిట్ త్రీ, జైలర్, సలార్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లోని రక్తపాతం, వైలెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. త్వరలో విడుదలయ్యే టాక్సిక్, స్పిరిట్, డ్రాగన్ లోనూ డైరెక్టర్స్ హింసకే ప్రాధాన్యతను ఇచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్స్ అంత ఘోరంగా సీన్లు తెరకెక్కిస్తే సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది? చిన్న చిన్న విషయాలకి మూవీస్ ని అడ్డుకునే సెన్సార్ బోర్డ్.. వైలెన్స్, బ్లడెడ్ సీన్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు న్యూస్ ఛానల్స్ కి మాత్రమేనా? సెన్సార్ బోర్డ్ కి అక్కర్లేదా? న్యూస్ ఛానల్స్ లో రేప్స్, మర్డర్స్ గురించి చూపించొద్దన్న నిబంధనలు ఉన్నాయి. రక్తపు చుక్క కనిపించకూడదని ఆదేశాలు అమలవుతున్నాయి. అత్యాచార కేసుల్లో నిందితులు, బాధితులను చూపించకుండా మాస్క్ వేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చెబుతోంది. మరి సినిమాల్లో బ్లడెడ్ సీన్స్, వైలెన్స్ చూపిస్తుంటే సెన్సార్ బోర్డ్ పట్టించుకోదా? మీడియా మీద ఆంక్షలు పెట్టినట్లే, సినిమాలపై ఎందుకు పెట్టడం లేదు? సినిమా రంగంపై సెన్సార్ బోర్డ్ కి అంత ప్రేమ ఎందుకు? మూవీస్ లో ఘోరాతి ఘోరంగా రేప్ సీన్స్ ను చూపిస్తారు. విచక్షణారహితంగా ప్రత్యర్థులను చంపటం, నరకడం, కాల్చడం, హింసించడాన్ని గ్రేట్ గా ఫీల్ అవుతారు.
మీడియాకి బాధ్యతలు ఉన్నట్లే, సినిమా రంగానికి లేవా? వారికి మాత్రమే మినహాయింపులు ఎందుకు? సినిమా నిబంధనలని ఎందుకు కఠినతరం చేయడం లేదు? సినిమాల్లో క్రూరత్వానికి కొత్త నిర్వచనం చెబుతున్నారు మన దర్శకులు. టూ మచ్ వైల్డ్ గా ఆలోచిస్తున్నారు. సైకోలు, గుండాలు, రౌడీలు, గ్యాంగ్ స్టర్స్ తమ జీవితంలో చేయలేనంత విధంగా సినిమాల్లో సీన్స్ తెరకెక్కిస్తున్నారు. దురందర్ వన్, దురందర్ 2 సీన్స్ చూస్తే ఎవరికైనా ఒళ్లు గగురుపుడుతుంది. ఈ మూవీస్ లో హింస గురించి ఎంత చెప్పినా తక్కువే. రెహ్మాన్ డెకాయిడ్ గా, అక్షయ్ కన్నా విలనిజం క్యారెక్టర్ లోనూ క్రూరత్వం చూస్తే.. మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అన్న ప్రశ్నలు వస్తాయి. అనిమల్, సలార్, విక్రమ్, జైలర్, మార్కో, ఇటీవల రిలీజ్ అయిన డిసి మూవీ.. ఇలా రక్తపాతం, హింస చుట్టూ సినిమా మొత్తం నడుస్తుంది. వైలెన్స్ కే కొత్త నిర్వచనం చెబుతున్నారు. మనుషులని ఇలా కూడా చంపొచ్చా? సమాజంలో జనాన్ని ఇలా హింసిస్తారా? పైశాచికంగా ప్రవర్తిస్తారా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. చిత్రాల్లో ఉన్న వైలెన్స్ ని పబ్లిసిటీకి వినియోగించుకుంటున్నారు. జనం చూడలేని సీన్స్ ని, స్క్రీన్ నుంచి మొహం తిప్పేసుకునే వైలెన్స్ కాదంటూ సమర్థించుకుంటున్నారు.
సినిమాల్లో రక్తపాతం, హింసాత్మక సీన్లు జనంపై ప్రభావం చూపవా? అంటే కచ్చితంగా చూపుతాయి. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన సెన్సార్ బోర్డ్ వైలెన్స్ పై సైలెన్స్ అంటోంది. తమ సినిమాలకి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి నిర్మాతలు, హీరోలు, దర్శకులు ప్రభుత్వం చుట్టూ తిరుగుతారు. తమ పనులు చేయించుకోవడానికి వంగి వంగి దండాలు పెడతారు. మరి సెన్సిటివ్ సీన్స్ విషయంలో దర్శకులు, నిర్మాతలు, హీరోలు జాగ్రత్తలు తీసుకోరా? డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా? హీరో రక్తపాతం క్రియేట్ చేసినా, అమాంతంగా 10 మంది రౌడీలను లేపేసినా వేదికల మీద గొప్పగా చెప్పుకుంటారు. ఫలానా సీన్ సినిమాకే హైలైట్ అంటారు. రూల్స్ మాత్రం పట్టించుకోరు. మీడియా పై ఆంక్షలు పెట్టే సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖలు.. సినిమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది హింసాత్మక, భయానక సినిమాలకే జై కొడుతున్నారు. అలాంటి మూవీస్, వెబ్ సిరీస్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ప్రెజెంట్ ఈ చిత్రాలు బాక్సాఫీస్ లో మంచి సక్సెస్ సొంతం చేసుకుంటున్నాయి.
కానీ సినిమాల్లో చూపించే హింస ఒక మనిషిని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది. ప్రెజెంట్ సినిమాల్లో హింస విపరీతంగా పెరిగిపోయింది. యాక్షన్ సినిమాల పేరుతో రక్తపాతం, బూతులు, క్రూరమైన దృశ్యాలను ఎక్కువగా చూపిస్తున్నారు. ఇది సమాజంపై, ముఖ్యంగా యువతపై చెడు ప్రభావం చూపిస్తోంది. సినిమాల్లో హింస పెరగడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ప్రేక్షకులు థ్రిల్ కోరుకుంటున్నారు కాబట్టి మేకర్స్ హై వోల్టేజ్ యాక్షన్ సీన్లని వాడుతున్నారు. గుండాగిరి, మాస్ ఎలివేషన్స్ సినిమా విజయానికి షార్ట్ కట్ గా మారాయి. హాలీవుడ్, ఇతర భాషల చిత్రాల స్ఫూర్తితో హింసాత్మక కథలను ఎంచుకుంటున్నారు. సమాజంపై ప్రభావం చూపుతుందని దర్శకులు ఆలోచించడం లేదు. చిన్న పిల్లలు, యువత ఈ హింసను చూసి నిజ జీవితంలోనూ దూకుడుగా ప్రవర్తించే అవకాశం ఉంది. సినిమా సీన్స్ ని ఫాలో అయి ఎంతో మంది నేరాలకు తెగబడ్డారు. సినిమా అంటే వ్యాపారం, అవును అది ఎవ్వరూ కాదనలేని సత్యం. సినిమాలు తీసేందుకు కోట్లలో ఖర్చవుతుంది. దానిని రాబట్టుకునేందుకు ఎన్నో రకాల మ్యాజిక్‌లు చేయాల్సి ఉంటుంది. అందుకని నరుక్కోవడాలు, చంపుకోవడాలతో హింసని మాత్రమే హైలైట్ చేయడం వల్ల సమాజానికి జరుగుతున్న నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే సమాధానం దొరకదు.
కొంతకాలంగా ఆడియన్స్ కూడా హింస, రక్తపాతం సినిమాలకి అలవాటు పడిపోతున్నారు. అనిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ క్రూరత్వం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇది మామూలు వైలెన్స్ కాదు, దాన్నే దర్శకులు ఒక రోగంగా మార్చుకుంటున్నారు. సినిమాల ప్రభావంతో నేరాలు పెరగటం, గ్యాంగ్ స్టర్స్, రౌడీ షీటర్స్ లా యువత మారిపోతున్నారు. సమాజంలో హీరోలు అనిపించుకునేందుకు బహిరంగంగా హత్యలు చేస్తున్నారు. మారణాయుధాలతో వీడియోలు పోస్ట్ చేస్తున్న ఘటనలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అంటారు డైరెక్టర్స్, నిర్మాతలు. వాళ్ళు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నామని ఆడియన్స్ వాదిస్తున్నారు. సో ఇక్కడ ఎవరిది తప్పు అనేది చెప్పడం చాలా కష్టం. సినిమాలను చూసి ఎంతో మంది క్రిమినల్స్ గా మారిపోతున్నారు. రక్తపాతం పారిస్తే కలెక్షన్స్ వస్తాయని నిర్మాతలు, దర్శకులు భావిస్తున్నారు. కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్లు, ఆ దర్శకుడు తీశాడు కాబట్టి తాను కూడా అంతకుమించిన హింసలో సైకోయిజాన్ని చూపించాలనే రీతిలో కథలు రాస్తున్నారు. దాన్నే జనం మీదకు వదులుతున్నారు. మరి ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి ఏం ఉపయోగం? సినిమాలతో సమాజంలో పాజిటివిటీని పెంచకపోయినా పర్వాలేదు కానీ, నెగిటివిటీని పెంచుతూ ఉండటమే ప్రెజెంట్ వచ్చిన సమస్య.
సమాజానికి నష్టం కలిగిస్తున్న అనేక వస్తువులపై ప్రభుత్వాలు భారీగా పన్నులు వసూలు చేస్తున్నాయి. కొన్నింటిని బ్యాన్ చేస్తున్నాయి. మరికొన్నింటిపై ఆంక్షలు విధిస్తున్నాయి. మరి వైలెన్స్ కాంటెంట్ ఉన్న సినిమాలకి ఎందుకు రెండింతలు, మూడింతల పన్ను విధించకూడదు? ఆ పన్ను కట్టేందుకు సిద్ధమైన వాళ్లే వైలెన్స్ సినిమాలు తీస్తారు. సినిమాలో ఉన్న స్టాండర్డ్స్ ఆధారంగా సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగానే, ప్రభుత్వం కూడా వైలెన్స్ ఆధారంగా పన్ను స్లాబ్స్ అమలు చేయాలి. అప్పుడే వైలెన్స్ విషయంలో దర్శకులు, నిర్మాతలు జాగ్రత్త పడతారు. భారత రాజ్యాంగం ప్రకారం నేరం చేయటమే కాదు, నేరాన్ని ప్రోత్సహించినా నేరంగానే పరిగణిస్తారు. ఆ కోణంలో చూస్తే సినిమాల్లో నేరాలు చేయటాన్ని హీరోయిజంగా చూపించడం ముమ్మాటికీ తప్పే. అలాంటి సినిమాలపై నిషేధం విధించడం చట్ట పరిధిలో లేకపోతే కనీసం అధిక పన్నులు విధించడం ద్వారా సమాజానికి కొంతైనా మేలు చేయొచ్చు. పన్ను భయంతో సినిమాల్లో కనీసం హింస కాంటెంట్ తగ్గించే అవకాశాలు పెరుగుతాయి.
సినిమాల్లో వైలెన్స్ పెరిగిపోతోంది. దానికి జనాలు అడిక్ట్ అవుతున్నారు, అదే కరెక్ట్ అనుకుంటున్నారు. కాబట్టి మారాల్సింది ఫిల్మ్ స్టాండర్డ్స్. మనం కూడా సినిమాని సినిమాలా చూడాలి, రియాలిటీని రియాలిటీగా చూడాలి. మనిషి జీవితంలో సినిమాల్లో చూపించినంత వైలెన్స్ ఉండదు. కానీ సినిమాల్లో మాత్రమే మసిపూసి మారేడుకాయ చేసి హింస, రక్తపాతాన్ని చూపించేస్తున్నారు. యువత అడిక్ట్ అయి నేరాలకు పాల్పడుతున్నారు.
తాజావార్తలు
-
Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
-
Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై స్టే ఎత్తివేత.. కానీ..!
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!