కాకినాడ తీరంలో గత 55 రోజులుగా నిలిచిపోయిన ‘స్టెల్లా ఎల్’ నౌకకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈరోజు తెల్లవారుజామున పశ్చిమ ఆఫ్రికాకు నౌక బయలుదేరి వెళ్లింది. కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కొటోనౌ పోర్టుకు నౌక బయల్దేరింది. కొటోనౌ పోర్టుకు బయల్దేరేందుకు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం అనుమతిని ఇచ్చారు. హల్దియా నుంచి 2024 నవంబరు 11న కాకినాడ తీరానికి స్టెల్లా షిప్ వచ్చిన విషయం తెలిసిందే.
హల్దియా నుంచి గతేడాది నవంబరు 11న కాకినాడ తీరానికి స్టెల్లా నౌక వచ్చింది. నౌకలోకి 32,415 టన్నులు లోడయ్యాక నవంబరు 27న అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా పేదల బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాలతో డిసెంబరు 4న మరోసారి తనిఖీలు చేయగా.. బియ్యంలో 36 శాతం ఫోర్టిఫైడ్ కర్నెల్స్ ఉన్నట్లు తేలింది. దీంతో నౌకలోకి రేషన్ బియ్యం ఎత్తిన సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ ఓనర్ ప్రదీప్ అగర్వాల్, మేనేజర్ కళ్యాణ్ అశోక్ లపై 6ఏ కింద పౌరసరఫరాల అధికారులు కేసులు నమోదు చేశారు. నౌకలో పట్టుబడిన 1,320 టన్నుల రేషన్ బియ్యాన్ని డిసెంబరు 30న స్వాధీనం చేసుకుని.. గోదాములోకి తరలించి సీజ్ చేశారు. షిప్ నిలిపినందుకు చెల్లించాల్సిన యాంకరేజి చార్జి, ఎక్స్పోర్ట్ చార్జీ పోర్టు అథారిటీకి స్టీమర్ ఏజెంట్ చెల్లించారు.
ఎగుమతిదారుల అభ్యర్థనతో మిగిలిన బియ్యాన్ని నౌకలోకి లోడింగ్‌కు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ ప్రక్రియ ఆదివారం పూర్తయ్యింది. యాంకరేజి ఛార్జి, ఎక్స్‌పోర్టు రుసుము పోర్టు అథారిటీకి స్టెల్లా నౌక స్టీమర్ ఏజెంట్ చెల్లించి నోడ్యూస్ ధ్రువీకరణ పొందారు. అనంతరం కస్టమ్స్ అధికారులు ఆదివారం క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో స్టెల్లా నౌక పశ్చిమ ఆఫ్రికా తీరంకు నేడు బయల్దేరింది. తుఫాన్ కారణంగా మొదటి నుంచి స్టెల్లా నౌకకు అవాంతరాలే ఎదురైన విషయం తెలిసిందే.