Hollywood Actors: ప్రపంచంలో ఎంతోమంది నటీనటులకు స్వర్గధామం హాలీవుడ్! అక్కడ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించిన తారలు ఎందరో హాలీవుడ్‌ను వదిలేస్తూ ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు టాప్ స్టార్స్ హాలీవుడ్ వీడి, తమకు నచ్చిన స్టేట్స్‌లో మకాం పెట్టేసుకున్నారు. వారి సరసన “టెడ్, డాడీస్ హోమ్, ట్రాన్స్ ఫార్మర్స్” వంటి సిరీస్ లో నటించిన మార్క్ వాల్ బెర్గ్ చేరనున్నారు. ఇప్పటికే జూలియా రాబర్ట్స్ వంటి మేటి నటీమణులు కొందరు హాలీవుడ్‌కు దూరంగా జరిగారు.
“హాలీవుడ్ అన్నది ఎంతోమందికి జీవనోపాధి కలిగిస్తోందని, అక్కడ యాక్టర్స్ కు, క్రియేటివ్ జీనియస్ కు తప్పకుండా స్థానం ఉంటుందని” మార్క్ వాల్ బెర్గ్ అంటున్నారు. కానీ, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తాను హాలీవుడ్ వీడవలసి వస్తోందని ఈ 51 ఏళ్ళ స్టార్ చెబుతున్నారు. హాలీవుడ్ ఎంతోమంది భవిష్యత్ ను తీర్చిదిద్దినదని, అయితే కొందరి జీవితాలనూ నాశనం చేసిందనీ మార్క్ అంటున్నారు. తన పెద్ద కొడుకు బాస్కెట్ బాల్ ప్లేయర్ అని, చిన్న కొడుకు గోల్ఫర్ కావడంతో వారి కెరీర్ కు ఇబ్బంది కలగరాదనే తాను హాలీవుడ్ వీడుతున్నట్టు మార్క్ వివరిస్తున్నారు. మార్క్ తో పాటే ఎందరో హాలీవుడ్ స్టార్స్ తమ వ్యక్తిగత జీవితం ఆనందమయం చేసుకోవడానికి హాలీవుడ్ ను వదలి పోతున్నట్టు చెబుతున్నారని, ఒక విధంగా వారి నిర్ణయం సబబైనదేనని మానసిక నిపుణులు చెబుతున్నారు. హాలీవుడ్ లో ఉండడం వల్ల సెలబ్రిటీ స్టేటస్ కారణంగా తారలు బయటకు అడుగు పెట్టాలన్నా ‘మీడియా’ వెంటపడుతోందని తెలుస్తోంది. మీడియావారి కంటపడకుండా కుటుంబ సభ్యులతో హాయిగా గడిపే అవకాశాలు సన్నగిల్లుతూ ఉండడం వల్లే తారలు హాలీవుడ్ వీడుతున్నారని సైకాలజిస్టుల అభిప్రాయం. మార్క్ తరువాత ఇంకా ఎంతమంది తారలు హాలీవుడ్ ను వీడిపోతారో చూడాలి.