పవిత్రమైన ఆచారాలను నిర్వహించే పూజారులే అసభ్యంగా ప్రవర్తించారు. ఆలయం ప్రాంగణంలోనే మందు పార్టీ చేసుకున్నారు. అంతేకాదు మద్యం మత్తులో అశ్లీల నృత్యాలతో రెచ్చిపోయారు. పూజారుల చేసుకున్న మందు పార్టీకి సంబందించిన వీడియోస్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. ఆలయ అధికారి ఫిర్యాదు మేరకు పూజారులపై కేసు నమోదు అయింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. భక్తులు మండిపడుతున్నారు.
విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులోని ప్రసిద్ధ పెరియ మరియమ్మన్ ఆలయంలో 28 ఏళ్ల తరువాత పవిత్ర కుంభాభిషేకం జరుగుతోంది. ఈ కుంభాభిషేకానికి వచ్చిన పూజారులు కొందరు.. గత రాత్రి మందు పార్టీ చేసుకున్నారు. తమిళ సినిమా పాటలతో అశ్లీల నృత్యాలతో రెచ్చిపోయారు. గతంలో ఆలయానికి వచ్చిన మహిళ భక్తులతో వీరు అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. వీడియోలు వైరల్ కావడంతో.. ఐదుగురు అర్చకులను అధికారులు విధుల నుంచి తొలగించారు. ఇతర ఆలయ పూజ విషయాల్లో వారు జోక్యం చేసుకోకుండా నిషేధం విధించారు. పెరియ మరియమ్మన్ ఆలయ అధికారి ఫిర్యాదు మేరకు పూజారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Pawan Kalyan: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపై పవన్ కల్యాణ్ ఛలోక్తులు!
విషయం తెలుసుకున్న అర్చకులు పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. అసిస్టెంట్ పూజారి గోమతి వినాయగం, తాత్కాలిక పూజారులు వినోద్, గణేషన్‌లను విధుల నుంచి తొలగించారు. మద్యం సేవించి అశ్లీల నృత్యం చేసిన తాత్కాలిక పూజారులు సహా మరో 3 మందిని తొలగించారు. కుంభాభిషేక వేడుకకు వచ్చిన కొంతమంది పూజారులు గోమతి వినాయగం ఇంట్లోనే బస చేస్తున్నారు. పూజారులు నృత్యం చేస్తున్న దృశ్యాలను ఆలయ మాజీ పూజారి హరిహరన్ కుమారుడు శబరినాథన్ వీడియో తీసి.. ఛారిటబుల్ ట్రస్ట్స్ శాఖ అధికారులకు, ఆలయ నిర్వహణ కమిటీకి ఫిర్యాదు చేశారు.