Tirumala: రేపటి నుంచి అలిపిరి వద్ద శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం నిరంతరాయంగా నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. వేంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ఇది నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం టికెట్ ధరను రూ.వెయ్యిగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస హోమంలో భక్తులు నేరుగానే కాకుండా వర్చువల్ విధానం ద్వారా హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఉదయం 9 గంటలు నుంచి 11 గంటలు వరకు హోమం నిర్వహిస్తామని, భవిష్యత్‌లో స్లాట్ రూపం టికెట్స్‌ను అందుబాటులో తీసుకువస్తామన్నారు. టీటీడి ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. టీటీడిలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పారు.
Also Read: Koti Deepotsavam LIVE : వేంకటేశ్వర మహాభిషేకం,సత్యనారాయణ స్వామి వ్రతం,అన్నవరం శ్రీ సత్యదేవుని కల్యాణం
టీటీడీలో ఉద్యోగాలిప్పిస్తామని దళారీలు చెప్పే మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని ఆయన సూచించారు. ఈ ఉద్యోగాలు అన్నీ పారదర్శకంగా , అవినీతికి అస్కారం లేకుండా భర్తీ చేస్తామన్నారు.. దీని వెనుక దళారులు పోస్టులు ఇప్పిస్తామని మోసం చేస్తే నమ్మవద్దు. ఈ నియామకాలు చెన్నై ఐఐటీ వారితో నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు వస్తాయని.. దళారులు, రికమండేషన్‌తో వస్తాయి అని చెప్పే వారి మాటలు నమ్మవద్దన్నారు. ఉద్యోగాలు కల్పనలో ఛైర్మన్, ఈవోల ప్రమేయం ఉండదన్నారు. భవిష్యత్తులో ఈ శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్‌కు చాలా డిమాండ్ వస్తుందన్నారు. శాశ్వతంగా హోమం కోసం భవనాలను నిర్మిస్తామన్నారు. ఈనెల 26న ప్రధాని మోడీ తిరుమల పర్యటనకు వస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు.
ఇదిలా ఉండగా.. తిరుమలలో ఎల్లుండి(శుక్రవారం) శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం జరగనుంది. ఈ ఉత్సవ నేపథ్యంలో స్వామివారికి ప్రాతఃకాలంలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు, తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 గంటలలోపు తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు కైశికద్వాదశి ఆస్థానాన్ని పురాణపారాయణం ద్వారా ఘనంగా నిర్వహిస్తారు.పురాణాల ప్రకారం కైశిక ద్వాదశిని ప్రబోధోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంథాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్లారు. కైశికద్వాదశినాడు ఆయన్ను మేలుకొలుపడం రివాజు. సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది.