ద్వీపదేశం శ్రీలంక తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దేశ ఖజానాలో విదేశీ మారక నిల్వలు లేవు. దీంతో ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంది. అయితే దేశంలో ఆహార సంక్షోభం మరింత పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులు వరిని సాగు చేయాలని ప్రభుత్వం వేడుకుంటోంది. ఇప్పటికే ఆహార సంక్షోభం తీవ్రంగా ఉందని.. మరో 50 శాతం ఉత్పత్తి తగ్గితే శ్రీలంక పరిస్థితులు మరింత తీవ్ర పరిస్థితులకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శ్రీలంకలో ఏడు దశాబ్ధాలలో ఎప్పుడు లేనంతగా ఆహార, ఆర్థిక సంక్షోభం నెలకొంది. 2.2 కోట్ల జనాభా ఉన్న చిన్న దేశం అనేక సమస్యలతో అల్లాడుతోంది. ఆహారం, ఇంధనం, మెడిసిన్స్ ఇలా కీలక దిగుమతుల కోసం డబ్బులు చెల్లించడానికి చిల్లిగవ్వ కూడా లేదు. వచ్చే ఐదు, పది రోజుల్లో రైతులంతా తమ పొలాల్లో అడుగుపెట్టి వరిని సాగు చేయాలని కోరుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అమరవీర మంగళవారం అన్నారు. ఇప్పటికే శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే రానున్న కాలంలో ఆహారం సంక్షోభం తీవ్రం అవుతుందని ఇప్పటికే హెచ్చరించారు. అయితే ఎరువులను దిగుమతి చేసుకోవడానికి 600 మిలియన్ డాలర్లు అవసరమవుతాయని అంచనా వేశారు.రాబోయే రెండు సీజన్లలో వరి, తేయాకు, మొక్కజొన్నకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండే అవకాశం కూడా తక్కువగానే ఉంది.
భారత్ నుంచి 65,000 టన్నుల ఎరువులను సేకరించేందుకు భారత్ తో చర్చలు జరుపుతున్నట్లు, మరో ఏడు దేశాలకు కోరుతున్నామని అమరవీర చెప్పారు. అయితే ఇవి ఎప్పుడు శ్రీలంకకు చేరుతాయో చెప్పలేమని ఆయన అన్నారు. ప్రస్తుతం శ్రీలంకలో కరెన్సీ విలువ 50 శాతం క్షీణించిది. ఆహార ద్రవ్యోల్భనం 46 శాతానికి చేరుకుంది.