NTV Telugu Site icon

Sri lanka: శ్రీలంక వెళ్లాలనుకుంటున్నారా?.. భారత టూరిస్టులకు ఫ్రీ ఎంట్రీ

Srilanka

Srilanka

Sri lanka: శ్రీలంక వెళ్లాలనుకుంటున్నారా.. ఇక నుంచి ఆ దేశానికి వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఈ మేరకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ద్వీప దేశం పర్యాటక రంగాన్ని పునర్నిర్మించే ప్రయత్నాల మధ్.. భారతదేశం, ఇతర ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచిత టూరిస్ట్ వీసాలు జారీ చేసే విధానాన్ని శ్రీలంక మంత్రివర్గం ఆమోదించిందని విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ఈరోజు తెలిపారు.ఇది పైలట్ ప్రాజెక్ట్‌గా మార్చి 31, 2024 వరకు అమలులో ఉంటుందని విదేశాంగ మంత్రి సబ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశం, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు తక్షణమే ఉచిత ప్రవేశానికి శ్రీలంక కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ దేశాల నుంచి పర్యాటకులు శ్రీలంకను సందర్శించినప్పుడు రుసుము లేకుండా వీసాలు పొందగలరు.

Also Read: Ayodhya Temple: రామమందిరంలో అర్చకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలు ఇవే..

ద్వీపదేశమైన శ్రీలంకకు పర్యాటకమే ప్రధాన ఆదాయ మార్గంగా ఉంది. పర్యాటకం ద్వారానే శ్రీలంకకు ఆదాయం సమకూరుతోంది. కొవిడ్‌ మహమ్మారికి తోడు ఆ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం మూలంగా పర్యాటకుల రాక తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగానికి మళ్లీ ఊపిరి పోయాలని శ్రీలంక సర్కారు నిర్ణయించింది. లక్షల మంది పర్యాటకులను ఆకర్షించాలని శ్రీలంక లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే వీసా ఫ్రీ నిర్ణయం తీసుకుంది. గత కేబినెట్‌ సమావేశంలోనే ఈ అంశం చర్చకు రావడం గమనార్హం. గతంలో 5 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్‌కు అనుమతివ్వాలని భావించగా.. తాజాగా దాన్ని 7కు పెంచుతూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Russia: రష్యా అధ్యక్షుడికి గుండెపోటు.. బెడ్‌రూంలో కింద పడిపోయిన పుతిన్‌!

శ్రీలంకకు వెళ్లే పర్యాటకులలో ఎక్కువగా భారత్‌ నుంచే వెళ్తారు. ఆ తర్వాత రెండో స్థానంలో చైనా ఉంది. 2019 ఈస్టర్ సండే బాంబు పేలుళ్ల తర్వాత 11 మంది భారతీయులతో సహా 270 మంది మరణించగా..500 మందికి పైగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఈ ద్వీపానికి పర్యాటకుల రాక తగ్గింది. 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి అపూర్వమైన ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంక.. అధ్యక్షుడు రాజపక్సే రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనకారులతో రాజకీయ అశాంతిని కూడా ఎదుర్కొంది. ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం, ఔషధం, వంటగ్యాస్, ఇతర ఇంధనం, టాయిలెట్ పేపర్, అగ్గిపెట్టెల వంటి అవసరమైన వస్తువులకు తీవ్రమైన కొరతను శ్రీలంక ఎదుర్కొంది. ఇంధనం, వంట గ్యాస్ కొనుగోలు చేయడానికి శ్రీలంక ప్రజలు నెలల తరబడి దుకాణాల వెలుపల గంటల తరబడి లైన్లలో వేచి ఉండవలసి వచ్చింది.