Sunrisers Hyderabad Retain List for IPL 2025: ఐపీఎల్ 2025 ముందు బీసీసీఐ మెగా వేలం నిర్వహించనున్న విషయం తెలిసిందే. వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు అవకాశం ఇచ్చింది. ఇందులో ఓ రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఉంటుంది. రిటెన్షన్ లిస్ట్ సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని వదిలేస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ప్రాంచైజీ రిటెన్షన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ టాప్ రిటెన్షన్‌గా ఉన్నాడని తెలుస్తోంది. క్లాసెన్ కోసం ఎస్ఆర్‌హెచ్ ఏకంగా రూ.23 కోట్లు వెచ్చించనుందట. గత సీజన్‌లో క్లాసెన్ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కెప్టెన్ పాట్ కమిన్స్‌ను రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంటుందని తెలుస్తోంది. గత సీజన్‌లో కెప్టెన్‌గా కమిన్స్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2024లో సంచలన ప్రదర్శన చేసిన యువ ఆటగాడు అభిషేక్ శర్మకు ఎస్ఆర్‌హెచ్ రూ.14 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంటుందట. మెరుపు ఇనింగ్స్ ఆడిన ట్రావిస్ హెడ్‌ను, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని కూడా సన్‌రైజర్స్ అట్టిపెట్టుకుంటుందని తెలుస్తోంది. ఈ ఐదుగురు కొనసాగింపు దాదాపు ఖరారు అయింది. ఎస్ఆర్‌హెచ్ ప్రాంచైజీకి మరో ఆటగాడిని కూడా అట్టిపెట్టుకునే అవకాశం ఉంది.