హుజూరాబాద్ బై పోల్…..తెలంగాణలో హైవోల్టేజీ ఎలక్షన్. ఈ నెలలోనే అనుకున్నారంతా. షెడ్యూల్ రేపో మాపో అన్నారు. ఇంకేముంది ..అధికార పార్టీతో సహా అన్ని రాజకీయపక్షాల్లో చెప్పలేనంత హడావుడి. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. భారీ ర్యాలీలు, సభలు.. పంచ్ డైలాగులు. దాంతో పొలిటికల్ హీట్ పీక్ కి చేరింది. కానీ అంతలోనే పెద్ద షాక్. ఎన్నికలు ఇప్పట్లో లేవంటూ ఈసీ అనౌన్స్‌మెంట్. దాంతో నేతల ఉరిమే ఉత్సాహం కాస్తా చల్లబడింది. ఈటల రాజేందర్ వ్యవహారం మొదలై దాదాపు ఐదు నెలలవుతోంది. అప్పటి నుంచి తెలంగాణ పాలిటిక్స్ మొత్తం హుజూరాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. ఇక ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకున్నాక పొలిటికల్ వెదర్ మరింత హీటెక్కింది. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి పీసీసీ పీఠం ఎక్కారు. దాంతో రాష్ట్రంలో పొలిటికల్ మూడ్ మొత్తం ఈ ఉప ఎన్నికల మీదకు మళ్లింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలు సెప్టెంబర్‌లో పక్కా అనుకున్నారంతా. ఎలక్షన్ కోడ్ భయంతో సీఎం కేసీఆర్ హడావుడిగా దళితబంధుకు శ్రీకారం చుట్టారు. తరువాత హుజూరాబాద్‌లో పెద్ద మీటింగ్ కూడా పెట్టారాయన. మరోవైపు ఈటల రాజేందర్ పాదయాత్రతో నియోజకవర్గ ప్రజల చెంతకు వెళుతున్నారు. మొత్తం మీద ప్రధాన పార్టీలన్నీ కార్యకర్తల మీటింగ్‌లు..ప్రణాళికలు రెడీ చేసుకోవటంలో బిజీ బిజీ.. ఐతే, ఎన్నికల సంఘం ప్రకటనతో సీన్ మారిపోయింది. ఇలా జరుగుతుందని అన్ని పార్టీలు దీనిని ముందే ఊహించాయా? అధికార టీఆర్‌ఎస్ దీనినే కోరుకున్నదా? అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎన్నికలు వాయిదా పడితే ఎవరికి లాభం? కొందరు టీఆర్‌ఎస్‌కు లాభం అంటే …మరి కొందరు నష్టం అంటున్నారు. వాస్తవానికి కేసీఆర్‌కు ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇష్టం లేదని..అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు కరోనా కారణం చూపి వాయిదా కోరారనే టాక్ కూడా ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను కరోనా పరిస్థితుల రీత్యా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని… మరికొద్ది రోజులు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిని విషయం తెలిసిందే. హుజూరాబాద్‌ని దృష్టిలో పెట్టుకునే అలా చేసిందనే విమర్శలు వచ్చాయి.
ఈసీ తాజా ప్రకటనతో హుజూరాబాద్ ఉప ఎన్నికలు దసరా పండగ తర్వాతే జరుగుతాయి. అక్టొబర్ లేదా నవంబర్లో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిన మీదటే ఈసీ ఈ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ మాత్రం ఎన్నికలకు తమ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిని బట్టి అర్థమవుతుంది ఎన్నికల వాయిదా ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అన్న సంగతి. హుజూరాబాద్ ఎన్నికలు ఎంత ఆలస్యమైతే తమకు అంతమంచిదన్న భావనలో ఉంది టీఆర్‌ఎస్. ఆ పార్టీ వర్గాలు ఈ మాటే అంటున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. కేసీఆర్ మానసపుత్రిక దళితబదంధును విజయవంతంగా ఆ సామాజికవర్గంలోకి తీసుకుపోవచ్చు. ఇదే సమయంలో ఈటల రాజేందర్‌పై ఉన్న సానుభూతి కూడా తగ్గుతుందని బావిస్తోంది. అలాగే ఇతర పార్టీల నాయకులకు ..బూత్ లెవెల్ కార్యకర్తలకు గాలం వేయటానికి కూడా తగిన సమయం ఉంటుంది.
టీఆర్‌ఎస్ వ్యూహం రివర్స్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా దళిత బంధు. దళితులకు అంత పెద్ద మొత్తంలో నగదు ఇవ్వటం ఇతర బలహీన వర్గాలైన బీసీ కులాలు.. అలాగే ఆర్థికంగా వెనకబడిన వర్గాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉంది. గొర్రెల పంపకం. చేపల పంపకం వంటి స్కీంల్‌లు కేవలం బలమైన బీసీ వర్గాలకే ఇస్తున్నారని ..ఓట్లకోసమే ఆ పథకాలన్న విమర్శలు కేసీఆర్ ప్రభుత్వం మీద ఇప్పటికే ఉన్నాయి. దళిత బంధుతో అవి ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం కూడా ఉందన్నది కొందరి విశ్లేషకుల వాదన. ఇటు టీఆర్‌ఎస్‌కు..అటు బీజేపీకి ముఖ్యంగా ఈటెల రాజేందర్‌కు హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత కీలకంగా మారింది. అందుకే రెండు పార్టీలు శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయి. టీఆర్‌ఎప్ సర్వశక్తులను మోహరించింది. క్షేత్ర స్థాయిలో అన్ని వర్గాలనూ గులాబీ నేతలు తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. గెలుపు అవకాశాలను మెరుగుపరచుకునేందుకు అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీల ముఖ్య నాయకులను ఆకర్షించే పనిలో ఉన్నాయి.
టీఆర్‌ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పి.కౌశిక్ రెడ్డి, బీజేపీ నుంచి పెద్దిరెడ్డిని తమ వైపు లాగగలిగింది. వారే కాదు ద్వితీయ శ్రేణి నాయకులు, మండల స్థాయి నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ఆకర్షించే పనిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ ముఖ్యమైనదే. దాంతో ఏ అవకాశాన్నీ వదులుకునే పరిస్థితి లేదు. ఈ విషయంలో మిగతా వాటికన్నా అధికార పార్టీ చాలా ముందుంది. నియోజకవర్గంలో విస్తృత నెట్‌వర్క్, భారీ స్థాయిలో పార్టీ సభ్యత్వం కలిగి వుంది. దీంతో ఫిరాయింపులను సమర్ధవంతంగా అడ్డుకోగలుగుతున్నామని గులాబీ నేతలు అంటున్నారు. మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు. ఇటీవల దాదాపు 100 బీజేపీ, కాంగ్రెస్ ఆకర్యకర్తలు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. అలాగే కమలాపూర్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు ఈటల రాజేందర్ సమక్షంలో కాషాయ జెండా కప్పుకున్నారు. నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ క్యాడరంతా తన వెంట వచ్చేలా ఈటల ప్రయత్నిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
అయితే ఇదంతా ఈసీ ప్రకటన రాకముందు ..ఇప్పుడు మరో రెండు నెలల సమయం ఉంది. అప్పటికి పరిస్థితి నార్మల్‌గా ఉంటేనే. కోవిడ్19 తీవ్రత ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు. థర్డ్ వేవ్ విజృంభిస్తే అక్టోబర్‌లో కూడా ఎన్నికలు అనుమానమే. ఈ నేథ్యంలో నేతలు ఇన్ని రోజులు చేసిన హడావుడంతా ప్రయోజనం లేకుండా పోతుందా? పడ్డకష్టమంతా గంగపాలా ? అని పార్టీ శ్రేణులు బావిస్తే కష్టమే. అలా జరగకుండా ఉండాలంటే కంటిన్యూగా హుజూరాబాద్ వెంటపడాల్సిందే. సుదీర్ఘకాలంగా ఈటెలకు ఈ నియోజకవర్గంతో అనుబంధం ఉంది. కానీ టీఆర్‌స్ అభ్యర్థికి అంత అనుభవం లేదు. దళిత్ కార్డు, బీసీ కార్డు మీద టీఆర్‌ఎస్ ఆశపెట్టుకుంది. వారికి బాగా దగ్గరవ్వాలంటే నిరంతరం నియోజకవర్గంలో ఏదో ఒక యాక్టివిటీ నడుస్తూనే ఉండాల్సిందే. ప్రస్తుతం ఈటల రాజేందర్ వైపు గాలి వీస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఎన్నికలు ఆలస్యమైతే టీఆర్ఎస్ కు లాభం చేకూరే అవకాశం ఉందని బీజీపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఇంటలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నట్లు సమాచారం.అయితే ఆ రిపోర్టుల్లో నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అందులో ఎంత నిజమో తెలియదు.
మరోవైపు, హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదాకు కారణమైన ప్రభుత్వ నివేదిక పట్ల బీజేపీ మండిపడుతోంది. ఇప్పుడు వాయిదా వేసినా, ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది ఈటల రాజేందరేనని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఓటమి భయంతోనే రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎస్, డీజీపీలతో వాస్తవ విరుద్ధ నివేదికలను ప్రభుత్వం ఈసీకి పంపిందని ఆరోపిస్తున్నారు. టీఆర్‌ఎస్ ఓడిపోతోందని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదికలతోనే కేసీఆర్ కుట్రకు దిగారని ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ప్రభుత్వం తప్పుడు నివేదికలతో ఎన్నికలను వాయిదా వేయించిందంటోంది బీజేపీ. టీఆర్‌ఎస్, బీజేపీ సంగతేమో కానీ..కాంగ్రెస్‌కు ఎన్నికల వాయిదా మంచే చేసిందని చెప్పాలి. అభ్యర్థి ఎంపిక విషయంలో ఎటూ తేల్చలేదు. ఒక వేళ ఈ నెలలో ఎన్నికలు ఉంటే దానికి కాస్త ఇబ్బందిగానే ఉండేది. ఇక ఇప్పుడు టైం పుష్కలం. ఎన్నిరోజులైనా చర్చించుకోవచ్చు. హై కమాండ్‌కు ఎన్ని నివేదికలైనా ఇచ్చుకోవచ్చు!! ఏదేమైనా హుజూరాబాద్ హడావుడికి తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్టేమరి!!