South Africa Captain Temba Bavuma React on Defeat vs Australia: సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తనను చాలా బాధించిందని, మాటలు రావడం లేదని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్‌ను పేలవంగా ఆరంభించడమే తమ ఓటమికి కారణమని చెప్పాడు. ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేశామని, క్యాచ్‌లను పట్టినా ఫలితం మరోలా ఉండేదన్నాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో తొలి 10 ఓవర్లలోనే భారీగా పరుగులివ్వడం విజయవకాశాలను దెబ్బతీసిందని బవుమా పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్లతో ఓటమిపాలైంది.
మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా దక్షిణాఫ్రికా పరాజయంపై స్పందిస్తూ… ‘ఓటమి గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. ముందుగా ఆస్ట్రేలియాకు అభినందనలు. ఫైనల్‌కు బెస్టాఫ్ లక్. ఆసీస్ ఈరోజు బాగా ఆడింది. మేము బ్యాట్ మరియు బంతితో ప్రారంభించిన విధానం బాగాలేదు. అక్కడే మేము మ్యాచ్ కోల్పోయాము. కండిషన్స్ తగ్గట్లు బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా పేసర్లు మాపై ఒత్తిడిని పెంచారు. 24/4 స్కోర్ ఉన్నపుడు పోరాడే లక్ష్యాన్ని సాధించడం కష్టం. మిల్లర్ మరియు క్లాసెన్ బ్యాటింగ్ అద్భుతం. దురదృష్టవశాత్తు క్లాసెన్ ఎక్కువసేపు ఇన్నింగ్స్ కొనసాగించలేకపోయాడు’ అని అన్నాడు.
‘మిల్లర్ ఇన్నింగ్స్ అద్భుతమైనది. ఒత్తిడి పరిస్థితిలో అదీనూ ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో అలాంటి ఇన్నింగ్స్ అసాధారణమైనది. ఆస్ట్రేలియా బ్యాటర్లు తొలి 10 ఓవర్లలోనే 70 పరుగులు చేయడమే వారికి కలిసొచ్చింది. తర్వాతి బ్యాటర్లు నెమ్మదిగా ఆడుకునే అవకాశం దక్కింది. మార్క్‌రమ్, మహరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆసీస్ బ్యాటర్లపై వారు ఒత్తిడి తెచ్చారు. మాకు అవకాశాలు వచ్చినా.. సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఆ క్యాచ్‌లను పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కోయిట్జీ సూపర్ ప్రదర్శన చేశాడు. క్రాంప్స్ వచ్చినా జట్టు కోసం డికాక్ చివరి వరకు పోరాడాడు. అతడికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలనుకున్నాం కానీ.. కుదరలేదు. దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా డికాక్ నిలిచిపోతాడు’ అని టెంబా బవుమా తెలిపాడు.