Trinamool Congress: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తల నేపథ్యంలో బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. గంగూలీని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు విఫలమైనందు వల్లే మాజీ కెప్టెన్‌ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. రాష్ట్రంలో విపరీతమైన ప్రజాదరణ ఉన్న గంగూలీ పార్టీలో చేరతారని గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల్లో సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శిగా రెండోసారి కొనసాగిస్తూ.. అయితే గంగూలీకి మరోసారి అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ‘రాజకీయ ప్రతీకారానికి’ ఉదాహరణ అని తృణమూల్ పేర్కొంది.
బీజేపీ సౌరవ్‌ను పార్టీలో చేర్చుకుంటున్నట్లుగా బెంగాల్ ప్రజలలో ఒక సందేశాన్ని వ్యాప్తి చేయాలనుకుంటోందని తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. ఈ విషయంపై మేము నేరుగా మాట్లాడాలనుకోవట్లేదుని.. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత అలాంటి వార్తల వ్యాప్తికి బీజేపీ ప్రయత్నించిన క్రమంలోనే మాట్లాడుతున్నారు. బీసీసీఐ చీఫ్‌గా రెండోసారి గంగూలీని కొనసాగించకపోవటం వెనుక రాజకీయాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయన్నారు. సౌరవ్‌ను అవమానించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని కునాల్ ఘోష్ అన్నారు. ఈ ఏడాది మే నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. గంగూలీ ఇంటికి వెళ్లటం వెనుక అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, పరిస్థితులపై మాట్లాడటానికి గంగూలీనే సరైన వ్యక్తి అని పేర్కొన్నారు.
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ వర్సెస్ బాలుడు.. రోడ్డుపైనే పుషప్స్ ఛాలెంజ్..
బీజేపీ ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా పేర్కొంది. గంగూలీని పార్టీలోకి చేర్చుకోవడానికి పార్టీ ఎప్పుడూ ప్రయత్నించలేదని పేర్కొంది. సౌరవ్ గంగూలీ విషయంలో టీఎంసీ చేసిన ఆరోపణలను ఖండించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్. అవి నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశారు. గంగూలీని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నించిందో తమకైతే తెలియదన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడాన్ని టీఎంసీ మానుకోవాలని హితవు పలికారు. 1983 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ మంగళవారం బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. జై షా కూడా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఇతర అభ్యర్థులెవరూ రాకపోతే వరుసగా రెండోసారి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతారు. జై షా ఐసీసీ బోర్డులో భారత ప్రతినిధిగా గంగూలీ స్థానంలో ఉంటారని భావిస్తున్నారు.