Smriti Irani: గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీని ఉద్దేశించి గతంలో ఆమ్ నేత గోపాల్ ఇటాలియా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఒక వీడియోలో గోపాల్ ఇటాలియా ప్రధాని తల్లిని ఎగతాళి చేసినట్లుగా మాట్లాడాడని ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ మండిపడింది. ఆమెపై వ్యాఖ్యలు చేసినందుకు ఆప్‌కు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని స్మృతి ఇరానీ అన్నారు. గోపాల్ గతంలో మాట్లాడిన వీడియోను ఆమె ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. మోడీ నీచమైన వ్యక్తి అని గోపాల్ అంటున్నట్లు ఆ వీడియోలో ఉంది. ప్రధాని మోడీ తల్లి హీరాబాయి మోడీ ఎగతాళి చేస్తూ మాట్లాడినట్లు బీజేపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు.
ప్రధాని తల్లిని దుర్భాషలాడడం వల్ల గుజరాత్‌లో రాజకీయంగా ప్రజాదరణ లభిస్తుందని అనుకుంటే పొరబడినట్లేనని.. ఆ తప్పుకు గుజరాతీలు ఎన్నికల్లో రాజకీయ మూల్యం చెల్లించుకునేలా చేస్తారని కేంద్రమంత్రి స్మృతి విలేకరులతో అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ సూచనల మేరకే ఇటాలియా ఆ వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. గుజరాత్ ఆప్ నాయకుడు హిందూ సమాజాన్ని, దేవాలయాలకు వెళ్లే మహిళలను అవమానపరిచేలా అనేక వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొన్నారు. రాజకీయాలతో సంబంధం లేని 100 ఏళ్ల వృద్ధురాలిని ఆప్ నేతలు దుర్భాషలాడాలని చూస్తే అది క్షమించరానిది అని ఇరానీ అన్నారు. ప్రధాని మోడీ తల్లి చేసిన తప్పేంటని స్మృతీ ప్రశ్నించారు. ఆప్ రాజకీయ డిజైన్లను అడ్డుకునే పీఎం నరేంద్ర మోడీకి జన్మనివ్వడమే ఆమె చేసిన నేరమా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని ఆప్ నేతలు రాజకీయ దృష్టిని ఆకర్షించేందుకు హిందూ మహిళలను, మత సంస్థలను దూషించడంతో పాటు అన్ని రకాల ప్రకటనలు చేస్తోందని ఇరానీ ఆరోపించారు.
Bombay High Court: మావోయిస్టు లింక్‌ల కేసులో మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా నిర్దోషి
గుజరాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా గురువారం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీతో పాటు మహిళనుద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఆప్ నేతకు జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. దీనికి వివరణ ఇచ్చుకునేందుకు దేశరాజధానిలోని కమిషన్ కార్యాలయానికి వెళ్లగా, ఆయనను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆప్ నేతలు కార్యాలయం బయట ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునేలా ప్రవర్తించారని కమిషన్ చీఫ్ రేఖ శర్మట్వీట్ చేశారు. దీంతో పోలీసులు ఇటాలియాను అరెస్ట్ చేశారు. ‘అంతకుముందు జాతీయ మహిళ కమిషన్ చీఫ్ నన్ను జైలుకు పంపిస్తానని బెదిరిస్తుంది. మోడీ ప్రభుత్వం పటేల్ వర్గానికి జైలు కన్నా ఏం ఇస్తుంది. పాటిదార్ వర్గాన్ని బీజేపీ అసహ్యించుకుంటుంది.నేను జైలుకు భయపడను’ అని ఇటాలియా ట్వీట్ చేశారు. దీనిపై ఢిల్లీ మంత్రి స్పందిస్తూ ఆప్ నేత అనే కారణంతోనే అరెస్టు చేశారని విమర్శించారు.