Chiranjeevi-Balakrishna: ఇప్పటి దాకా సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ ఎనిమిది సార్లు పోటీపడ్డారు. ఈ యేడాది పొంగల్ కు చిరు, బాలయ్య మధ్య సాగిన పోటీ తొమ్మిదోసారి! ఈ సారి టాప్ స్టార్స్ మధ్య బాక్సాఫీస్ వార్ గతంలో ఏ సంవత్సరాన్ని పోలి ఉంటుందని మొదటి నుంచీ లెక్కలు వేసుకుంటున్నారు ఇరువురి అభిమానులు. 26 ఏళ్ళ క్రితం చిరంజీవి ‘హిట్లర్’, బాలకృష్ణ ‘పెద్దన్నయ్య’ రెండు చిత్రాలు సంక్రాంతి సందడిలోనే బంపర్ హిట్ సాధించాయి. ఆ రెండు సినిమాల్లో ఇద్దరు హీరోలు అన్న పాత్రలే పోషించారు. అప్పుడు ‘హిట్లర్’లో చిరంజీవి ఏడుగురు చెల్లెళ్ళకు అన్నయ్యగా నటిస్తే, ‘పెద్దన్నయ్య’లో బాలకృష్ణ ముగ్గురు తమ్ముళ్ళకు అన్నగా అభినయించారు. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ బరిలో ఢీ అంటే ఢీ అంటూ సాగాయి. చిరంజీవి చిత్రం ఎక్కువ కేంద్రాలలో శతదినోత్సవం చూడగా, బాలయ్య సినిమా అత్యధిక వసూళ్ల చూసింది. అదే సీన్ ఈ సారి కూడా రిపీట్ అవుతుందని భావించారు. ఎందుకంటే ఇప్పుడు కూడా చిరంజీవి, బాలకృష్ణ అన్న పాత్రలే పోషించారు. ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య, ఓ చెల్లెలుకు అన్నగా నటిస్తే, ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవి, ఓ తమ్ముడికి అన్నయ్య అనిపించుకున్నారు. అప్పుడు ‘హిట్లర్’లో హీరోగా సాగుతోన్న రాజేంద్రప్రసాద్ తో కలసి చిరంజీవి నటించారు, ఇప్పుడు మాస్ మహరాజా రవితేజతో ‘వాల్తేరు వీరయ్య’లో కనిపించారు. ఇక బాలయ్యలో కామన్ పాయింట్ ఏంటంటే, ‘పెద్దన్నయ్య’లో లాగే, ‘వీరసింహారెడ్డి’లోనూ ఆయన డ్యుయల్ రోల్ చేశారు. అందువల్ల 26 ఏళ్ళ తరువాత బాక్సాఫీస్ రిజల్ట్ కూడా రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ, ఆరేళ్ళ క్రితం చిరు, బాలయ్య మధ్య సాగిన పొంగల్ వార్ ను తలపిస్తూ ఈ సారి వారి సంక్రాంతి చిత్రయుద్ధం సాగిందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు.
Aryan Gowra: ఆకట్టుకుంటోన్న ‘ఓ సాథియా’ టైటిల్ సాంగ్
ఆరేళ్ళ క్రితం అంటే 2017 సంక్రాంతి బరిలో చిరంజీవి తన ‘ఖైదీ నంబర్ 150’తో రాగా, బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’గా బరిలోకి దూకారు. రెండు సినిమాలు వాటి బడ్జెట్ కు తగ్గ విజయాలు సాధించాయి. అప్పుడు బాలకృష్ణ సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్ తో వెలుగు చూసింది. ‘ఖైదీ నంబర్ 150’ చాలా గ్యాప్ తరువాత వచ్చిన చిరంజీవి సినిమాగా అలరించింది. ఆరేళ్ళ క్రితం ఈ రెండు సినిమాలు చిరంజీవి, బాలకృష్ణకు ‘కెరీర్ బెస్ట్’గా వసూళ్ళు చూపించాయి. చిరంజీవి చిత్రం అప్పట్లో రూ.130 కోట్లకు పైగా వసూలు చేయగా, బాలయ్య సినిమా అప్పుడు రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్స్ చూసింది. ఆరేళ్ళ క్రితం లాగే ఇప్పుడు కూడా చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు వారి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ చూపించడం విశేషం! పది రోజులకు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ రూ.170 పైగా కోట్లు పోగేస్తే, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ రూ. 130కి పైగా కోట్లు సాధించింది. ఈ రెండు సినిమాలు మరికొద్దిరోజులు మంచి వసూళ్ళు చూసే అవకాశం ఉందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. ఏది ఏమైనా ‘వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ రెండూ చిరు, బాలయ్యకు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ చూపించడం విశేషం! అంటే ఆరేళ్ళ సీన్ రిపీట్ అయిందన్న మాటేగా!