పాకిస్థాన్ దేశానికి, సైన్యానికి కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్‌తో సహా ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉంది. వీరు పాక్ ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారు. నిందితుల్లో “ట్రావెల్ విత్ జో” అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఆమె హైకమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొంది.. 2023లో పాకిస్థాన్ సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె పర్యటన సందర్భంగా.. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో సిబ్బందిగా పనిచేస్తున్న ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంది.
READ MORE: Team India New Captain: టీమిండియా టెస్టు కెప్టెన్సీపై కొనసాగుతున్న ఉత్కంఠ.. గిల్- గంభీర్ కీలక భేటీ..
కాగా.. డానిష్‌ను ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించి, మే 13, 2025న దేశం నుంచి బహిష్కరించింది. డానిష్ జ్యోతిని పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIO)కి పరిచయం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. డానిష్ ఢిల్లీలో ఉన్న సమయంలో ఆమె అతనితో సమన్వయంగా మెలిగింది. ఇది మరింత అనుమానాలను రేకెత్తించింది. జ్యోతి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. ఆమె సోషల్ మీడియాలో పాకిస్థాన్ పట్ల సానుకూల చిత్రాన్ని ప్రదర్శించడమే కాకుండా.. దేశానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని కూడా పాక్‌తో పంచుకుంది.
READ MORE: AP Liquor Case: ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు..
జ్యోతిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం, 1923లోని సెక్షన్ 3, 4,5 కింద అభియోగాలు మోపారు. ఆమె ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా ఈ కేసులో పంజాబ్‌లోని మలేర్కోట్లాకు చెందిన 32 ఏళ్ల వితంతువు గుజాలా, యమీన్ మొహమ్మద్, దేవిందర్ సింగ్ థిల్లాన్, అర్మాన్, బాను నస్రీనా ఉన్నారు. వీరు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారు.