చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా చాలా సాఫ్ట్‌గా మాట్లాడే శర్వా, ఈ వేదికపై మాత్రం పెయిడ్ ప్రమోషన్లు, ఫేక్ వ్యూస్‌పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తన పవర్ఫుల్ డైలాగ్‌తో అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. భీమ్స్ అందించిన సంగీతం, చంద్రబోస్ సాహిత్యం గురించి మాట్లాడుతూ శర్వానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. “మేము విడుదల చేసిన రెండు పాటలకు ప్రతిరోజూ లక్షలాది వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. ఇది డబ్బులు పెట్టి కొనుక్కుంటేనో, పెయిడ్ ప్రమోషన్లతో పుష్ చేస్తేనో వచ్చిన స్పందన కాదు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం మా దగ్గర అంత డబ్బులు కూడా లేవు. కేవలం ప్రేక్షకుల మీద ఉన్న నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నాం” అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెయిడ్ వ్యూస్ నడుస్తున్న తరుణంలో శర్వా చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
ఈ సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ శర్వానంద్ ఓ పవర్ఫుల్ డైలాగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. “తగ్గున్నోళ్లకు తగలబెట్టడం కూడా తెలుసు.. అనవసరంగా కెలుక్కోకండి, తగలబెట్టి పారేస్తాడు” అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌కు ఆడిటోరియం దద్దరిల్లింది. క్లాస్, ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న తాను ఇందులో ఫైట్స్ ఎలా చేస్తానా అని మొదట భయపడ్డానని, కానీ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ తనను పూర్తిగా మార్చేశారని అన్నారు. తన సినీ ప్రయాణంలో మలుపు తిప్పిన నలుగురు దర్శకులను గుర్తుచేసుకుంటూ శర్వానంద్ భావోద్వేగానికి లోనయ్యారు. “‘అమ్మ చెప్పింది’ సినిమాతో గున్నం గంగరాజు గారు నాకు నటన నేర్పితే, ‘ప్రస్థానం’తో దేవా కట్టా నాలోని నటుడిని బయటకు తీశారు. ‘రన్ రాజా రన్’తో సుజీత్ నాతో కామెడీ చేయించగలనని నిరూపించాడు. ఇప్పుడు ‘భోగి’తో సంపత్ నంది నన్ను ఒక కొత్త నటుడిగా రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇండస్ట్రీకి నాలో మరో కొత్త యాంగిల్ చూపించిన సంపత్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను” అని అన్నారు.

