ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఛైర్మన్ పల్లోంజీ మిస్త్రీ(93) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. భారత్‌లో పుట్టిపెరిగిన ఆయన 2003లో భారత పౌరసత్వం వదులుకుని ఐర్లాండ్ జాతీయుడిగా మారిపోయారు. గుజరాత్‌లోని పార్సీ కుటుంబంలో 1929లో పల్లోంజీ జన్మించారు. షాపూర్జీ పల్లోంజీ సంస్థ 1865లో ఏర్పాటు కాగా పారిశ్రామిక రంగంలో విశిష్ట సేవలకుగానూ పల్లోంజీ మిస్త్రీని కేంద్ర ప్రభుత్వం 2013లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 150 ఏళ్లకు కిందట ఏర్పడిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ దేశంలోని అతిపెద్ద వ్యాపార దిగ్గజాలలో ఒకటిగా ఎదిగింది. పల్లోంజీ మిస్త్రీ నికర ఆస్తుల విలువ 28.90 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా.
Read Also: Petrol Rates: పెట్రోల్ ధర మరో రూ.33 తగ్గుతుందా? ఎలా సాధ్యమంటే..?
కాగా పల్లోంజీ మిస్త్రీకి నలుగురు పిల్లలు ఉండగా అందులో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.పెద్ద కుమారుడు షాపూర్జీ మిస్త్రీ షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్‌గా ఉన్నారు. చిన్న కుమారుడు సైరస్ మిస్త్రీ 2012- 2016 మధ్య టాటా సన్స్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఇంకా ఇద్దరు కుమార్తెలు లైలా మిస్త్రీ, ఆలూ మిస్త్రీ ఉన్నారు. అటు పల్లోంజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ.. ఇంజనీరింగ్ నిర్మాణం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, వాటర్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో వ్యాపారం సాగిస్తోంది. ఆఫ్రికా, భారత్, మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా దేశాల్లో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థకు సంబంధించి 50వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయ భవనం, హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్ భవనాలను కూడా షాపూర్జీ పల్లోంజీ సంస్థ నిర్మిస్తోంది.